గుర్రంపోడు : గతంలో రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయిన చోటనే భర్త బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం గుర్రంపోడు మండల కేంద్రంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన శిలువేరు నవీన్ గతేడాది ఆగస్టులో అనూష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పది రోజులకే నవీన్, అనూష దంపతులు బైక్‌పై వెళ్తుండగా.. గుర్రంపోడు శివారులోని శశిలేటి వాగుపై గల బ్రిడ్జిపై ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనూష అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి వాగులో పడి మృతిచెందింది. నవీన్ తలకు గాయమైంది. అతడు హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. తన కళ్లముందే భార్య చనిపోవడంతో నవీన్ తట్టుకోలేకపోయాడు. భార్య లేని జీవితం వృథా అని భావించి ఆమె ఎక్కడైతే బ్రిడ్జిపై నుంచి పడి చనిపోయిందో సోమవారం నవీన్ అక్కడే బ్రిడ్జి పైనుంచి వాగులోకి దూకాడు. అయితే బ్రిడ్జి దిగువన ఇసుకలో పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రిడ్జిపై నుంచి పడి మృతిచెందిన భార్య
అక్కడే వాగులోకి దూకిన భర్త
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో
చికిత్స పొందుతున్న బాధితుడు


