
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కొండ కింద భక్తులు ఎక్కువగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 30నిమిషాలకు పైగా సమయం పట్టింది. స్వామిని 35వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.32,50,356 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
శాస్త్రోక్తంగా యాదగిరీశుడి నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట ఆలయంలో గురువారం నిత్యకై ంకర్యాల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి గజవాహన సేవలో తీర్చిదిద్ది సేవోత్సవం చేపట్టారు. కల్యాణ మండపంలో అధిష్టింపజేసి, విష్వక్సేనుడి తొలిపూజలతో కల్యాణతంతు పూర్తిచేశారు. ముందుగా ప్రభాతవేళ గర్భాలయంలో స్వామి,అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు.. నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.