
రికార్డు అసిస్టెంట్ సస్పెన్షన్
మోత్కూరు : మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బుంగ చరణ్ రాజ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి విచారణ చేసి బాధిత రైతుల నుంచి వాంగ్మూలం సేకరించారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. ఈమేరకు రికార్డు అసిస్టెంట్ చరణ్‌రాజ్ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ అతడిని సస్పెండ్ చేశారు. వసూళ్లకు పాల్పడిన రికార్డు అసిస్టెంట్ నుంచి రూ.1800 రికవరీ చేసి బాధిత రైతులు గంట శ్రీనివాస్‌రెడ్డి, బాసోజు అంజయ్యచారికి అందజేశామని తహసీల్దార్ జ్యోతి విలేకరులకు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్‌ను రాజాపేటకు డిప్యుటేషన్‌పై పంపిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజాపేటలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లును మోత్కూరుకు నియమించారు.
ముగిసిన
పదోన్నతుల ప్రక్రియ
భువనగిరి: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మంగళవారం ముగిసింది. జిల్లాలో 1:1 ప్రకారం మొత్తం 100 ఖాళీల పోస్టులకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఎస్ హెచ్‌ఎంలుగా పదోన్నతుల కోసం ఈ నెల 25న వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు. 96 పోస్టులు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉండగా.. నాలుగు పోస్టులు ఉన్నత పాఠశాలల్లో ఉన్నాయి. పదోన్నతులు పొందిన వారికి మంగళవారం విద్యాశాఖ అధికారులు ఆర్డర్లు జారీ చేశారు. వీరు 15 రోజుల్లో నిర్ణీత పాఠశాలలో చేరాల్సి ఉంటుంది.
ముగ్గురి పదోన్నతులు నిలిపివేత
ఈ ప్రక్రియలో ముగ్గురికి పదోన్నతులు నిలిపివేశారు. ఇందులో ఒకటి పీఎస్‌హెచ్‌ఎం పోస్టు కాగా రెండు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరిలో ఇద్దరు ఉండటంతో ఆ పోస్టును మహిళకు కేటాయించాలని కోరడం, రెండోది అర్హత లేని వారికి పదోన్నతి కల్పించే విషయం, మూడోది సస్పెండ్‌కు గురైన ఉపాధ్యాయుడికి పదోన్నతి కల్పించడంతో ఈ మూడు పోస్టులను నిలిపివేశారు.
పథకాలు ప్రజలకు
చేరేలా చూడాలి
భువనగిరిటౌన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మోతి మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈమేరకు కలెక్టరేట్‌లో కలెక్టర్ హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ డైరెక్టర్ మోతి పాల్గొని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా చూడాలన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. బాల సదనం సందర్శించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, సీడీపీఓ విజయలక్ష్మి, అనంతలక్ష్మి ఉన్నారు.