
వినాయకా.. పదవులెవరికి?
సాక్షి, యాదాద్రి : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిసే లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని నిర్ణయించడంతో ఆశావాహులు పదవి దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడు రూపొందించిన జాబితా అధిష్టానం వద్దకు చేరింది.
సామాజిక వర్గాల వారీగా
పీసీసీకి చేరిన జాబితా
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సామాజికవర్గ సమీకరణకు పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ సామాజికవర్గాల వారీగా ఆశావాహుల పేర్లను పీసీసీకి పంపించారు. స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఈ పేర్లు స్వీకరించారు. అయితే డీసీసీ అధ్యక్షుల ద్వారా పీసీసీకి చేరిన జాబితాపై పార్టీ అధిష్టానం క్రాస్ చెక్ చేసింది. ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ సంపత్ గత నెల భువనగిరికి వచ్చిన సమయంలో జాబితాపై విచారణ చేశారు. అర్హులకు ఇచ్చారా.. పార్టీ విధేయులేనా.. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారా.. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చారా అని విచారణ చేశారు. పార్టీ కేడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు.
ముందుగా డైరెక్టర్ల పదవుల భర్తీ
నామినేటెడ్ పదవుల్లో ముందుగా కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి, డైరెక్టర్ల పదవులను పెండింగ్‌లో ఉంచింది. అయితే చైర్మన్లు ఉన్న ప్రతి కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పదవులను ముందుగా భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు వారం పదిరోజుల్లో శుభవార్త వింటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.
నియోజకవర్గానికి రెండు పదవులు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండేసి పదవుల చొప్పున ఇవ్వనున్నారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల నామినేటెడ్ పదవుల కోసం పేర్లు అధిష్టానానికి పంపించారు. పార్టీలో అంతర్గత విచారణ కూడా పూర్తయింది. దాదాపు ఆయా అభ్యర్థులకు డైరెక్టర్ల పదవులు వరించబోతున్నాయి.
కార్పొరేషన్ చైర్మన్లు సైతం
పార్టీ అధిష్టానం ఆలోచన మేరకు నామినేటెడ్ పదవుల్లో ప్రధానమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేయనున్నారు. డైరెక్టర్ల పదవులు భర్తీ కాగానే ఈ ప్రక్రియ జరగనుందని సమాచారం. ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రులు, సీఎం స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ ఎంపికకు ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. పీసీసీ, సీఎం స్థాయిలో ఎంపిక చేసిన వారి వివరాలను ఏఐసీసీకి పంపిస్తారు. అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత పదవుల పందేరం జరగనుంది. జిల్లా నుంచి నాలుగైదు పేర్లు కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిసేలోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయం
ముందుగా కార్పొరేషన్ డైరెక్టర్
పోస్టులు భర్తీ
సామాజిక వర్గ సమీకరణకు పెద్దపీట
నేతల్లో చిగురిస్తున్న ఆశలు
ఇప్పటికే జాబితాను పీసీసీకి
పంపించిన ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు