
పంచాయతీ పోరుకు సిద్ధం!
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ల వారీగా విడుదల చేయాలని మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు గురువారం గ్రామ పంచాయతీల్లో ముసాయిదా జాబితాను ప్రకటించడానికి జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లాలోని 17 మండలాల్లోని 427 గ్రామ పంచాయతీల్లో 532218 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,64,567 మంది పురుషులు, 2,67,649 మంది సీ్త్రలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. పోలింగ్ స్టేషన్‌లు 3,704 ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలి విడతలో 10 మండలాలు, 220 గ్రామ పంచాయతీలు, 1876 వార్డులు, రెండో విడతలో ఏడు మండలాలు, 207 గ్రామ పంచాయతీలు, 1828 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఓటర్ల, పోలింగ్‌కేంద్రాల ముసాయిదా జాబితా
గ్రామ పంచాయతీల్లో ప్రకటించే ముసాయిదాపై అభ్యంతరాలను, సలహాలను అధికారులు స్వీకరిస్తారు. ఇందుకోసం రాజకీయ పార్టీలకు జిల్లా స్థాయి, మండల స్థాయిలో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ద్వారా వివరిస్తారు. ఓటర్లు, రాజకీయ పార్టీలనుంచి వచ్చిన ఫిర్యాదులు, సలహాలను ఈనెల 31న పరిష్కరిస్తారు. అనంతరం వచ్చేనెల 2న తుది జాబితాను విడుదల చేస్తారు.
వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం
అసెంబ్లీ ఓటరు జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు రూపొందించారు. జనవరి 1న ప్రకటించిన సాధారణ ఎన్నికల జాబితాకు అదనంగా జూలై 7 వరకు వచ్చిన నూతన ఓటర్ల చేరికను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఒకే వార్డు ప్రజలు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా ఓటరు జాబితాలను సిద్ధం చేశారు.
28న ఓటర్ల, పోలింగ్‌కేంద్రాల
ముసాయిదా జాబితా విడుదల
వచ్చే నెల 2న తుది జాబితా ప్రకటన
ఓటరు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా ఇలా..
28న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రచురణ
29న రాజకీయ పార్టీలతో సమావేశం
30న మండల స్థాయిలో రాజకీయ
పార్టీలతో సమావేశం
28 నుంచి 30 వ తేదీ వరకు
అభ్యంతరాల స్వీకరణ
31న అభ్యంతరాల పరిష్కారం వచ్చేనెల
2న తుది జాబితా ప్రకటన