లాభాల పూ‘బంతి’ | - | Sakshi
Sakshi News home page

లాభాల పూ‘బంతి’

Aug 9 2025 8:50 AM | Updated on Aug 9 2025 8:50 AM

లాభాల

లాభాల పూ‘బంతి’

పెద్దవూర: బంతి సాగును జూన్‌, జూలై, అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో సాగు చేసేవారు. కానీ గత కొన్నేళ్లుగా రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. జూన్‌, జూలై నెలల్లో సాగు చేసిన బంతి సాగు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లోనూ, అక్టోబర్‌, నవంబర్‌ నెలలో సాగు చేసిన బంతిపూలు డిసెంబర్‌, జనవరితో పాటు ఫిబ్రవరిలో వచ్చే పండుగలు, పెళ్లిళ్లు, జాతరలు, ఫంక్షన్‌లకు దిగుబడి వస్తుండటంతో మంచి గిరాకీ వస్తుంది. రైతులు నీటి వసతిని బట్టి బంతిని సాగు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని హార్టికల్చర్‌ అధికారి మురళి తెలిపారు.

యాజమాన్యం రెండు రకాలు..

ఆఫ్రికన్‌ మేరీగోల్డ్‌ : ఈ జాతి ఎత్తుగా పెరిగి అతి పెద్ద సైజు పూలు పూస్తాయి. ఇందులో ఆఫ్రికన్‌ జెయింట్‌, ఆరెంజ్‌ డబుల్‌, ఆఫ్రికన్‌ ఎల్లోజెయింట్‌ డబుల్‌, క్రాక్‌ జాక్‌, గోల్డెన్‌ ఏజ్‌ రకాలు అనువైనవి.

ఫ్రెంచ్‌ మేరీగోల్డ్‌ : ఈ జాతి పూలకుండీల్లో పెంచుకునే పొట్టి రకాలు. దీనిలో రెడ్‌ బ్రోక్‌డ్‌, రెస్పిన్‌ రెడ్‌, బట్టర్‌ స్కాచ్‌, వాలెన్నియా రకాలు అనువైనవి.

నేలలు: నీరు త్వరగా ఇంకిపోయే తేలిక పాటి సారవంతమైన నేలలు, ఇసుక నేలలు, నీటి తేమ తక్కువగా ఉండే నేలలు బంతి సాగుకు అనుకూలం. బంతిని మిరప, పత్తి పంటల్లో రక్షక పంటగా కూడా సాళ్లలో సాగు చేసుకోవచ్చు.

వాతావరణం: మన వాతావరణ పరిస్థితులు బంతిసాగుకు అనుకూలం. జూలై మధ్య కాలం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటితే మార్కెట్‌కు పూల సరఫరా సెప్టెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు చేయొచ్చు.

నారుమళ్లు: ఎకరానికి సరిపడ నారు పెంచడానికి 800–1000 గ్రాముల విత్తనం అవసరం. మళ్లు తయారు చేసుకునే సమయంలో ఒక చదరపు మీటరుకి 8–10 కిలోలు బాగా చిలికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి మొదలు ఫాలిడాల్‌ పొడి చల్లితే చీమలు, చెదలు వంటి ఇతర క్రీముల నుంచి రక్షణ పొందవచ్చు. ఎత్తు నారుమళ్లు చేసుకుని విత్తనాన్ని సాళ్లలో నాటుకుంటే మొక్కల మధ్యదూరం సమంగా ఉండి నారు మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దీనివలన కలుపు మొక్కలు, చీడపీడల నివారణ కూడా వీలవుతుంది. విత్తిన 5–7 రోజుల్లో మొలకలు వస్తాయి.

నాటే విధానం: 15–20 రోజుల వయసు లేదా 3–4 ఆకులు వచ్చిన మొక్కలను 45్ఙశ్రీ25 సెంటీమీటర్ల దూరంలో నాటితే మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండి పూల దిగుబడి పెరుగుతుంది. నారుని సాయంకాలం నాటుకుంటే బాగా పాతుకుంటాయి. ఆఫ్రికన్‌ మొక్కల్ని 40్ఙశ్రీ30 సెంటీమీటర్లు దూరంలోనూ, ఫ్రెంచ్‌ బంతి మొక్కల్ని 20్ఙశ్రీ20 సెంటీమీటర్ల దూరంలో నాటితే పూల దిగుబడి బాగా ఉంటుంది. నాటిన తర్వాత పల్చగా నీరు పెట్టుకోవాలి.

ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చిలికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితోపాటు 20–40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 35 కిలోల పోటాష్‌ను ఇచ్చే ఎరువులను వేయాలి. మొక్కలు నాటిన 60 రోజుల వరకు శాఖీయంగా పెరిగే దశలో ఉంటాయి. ఈ సమయంలో తగినంత తేమ ఉండేలా చూడాలి. నేల స్వభావాన్ని బట్టి 5–8 రోజుల వ్యవధిలో నీరు కట్టాలి.

కత్తిరింపులు: వాణిజ్యపరంగా పెంచే ఆఫ్రికన్‌ బంతి రకాలు ఎత్తుగా పెరిగి చాలా తక్కువగా పూలు వస్తాయి. కనుక మొక్కలు 30–40 సెంటీమీటర్ల ఎత్తులో లేదా నాటిన 30–35 రోజులకు తలభాగం కత్తిరిస్తే మొక్క కింది భాగం నుంచి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి పూల దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా మొక్కలకు వచ్చిన పూలన్నీ ఒకే పరిమాణంలో ఉండి మంచి రంగు సంతరించుకోవడంతో గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది.

సస్యరక్షణ:

నారుకుళ్లు తెగులు: నేలలో తడి ఎక్కువగా ఉండి వెచ్చని వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. మొలకెత్తిన నారు మొక్కల కాండం కుళ్లి చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్‌ లేదా 1.5 గ్రాముల కార్భండిజమ్‌ కలిపిన మందు ద్రావణంతో నారు మడిని తడిపి నివారించవచ్చును.

మొగ్గ తొలిచే పురుగు: లార్వాలు పూమొగ్గలను తొలుస్తాయి. పూ మొగ్గలు విచ్చుకోవు. పూల దిగుబడి బాగా తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కార్బిరిల్‌ కలిపి పిచికారీ చేసుకోవాలి.

పేను: పెద్ద, పిల్ల పురుగులు మొగ్గల్ని ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు మలాథియాన్‌ లేదా 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్‌ కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

తామర పురుగులు: పిల్ల, తల్లి పురుగులు ఆకులు, పూల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఆకుల మీద తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆశించిన మొగ్గలు గోధుమరంగుకు మారి ఎండిపోతాయి. నివారణకు లీటరు నీటికి 2 మిల్లీ లీటర్లు డైమిథోయేట్‌ ను కలిపి పిచికారీ చేయాలి.

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం

మిరప, పత్తి పంటల్లో రక్షణ పంటగా బంతి పూల సాగు

లాభాల పూ‘బంతి’1
1/1

లాభాల పూ‘బంతి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement