
రైతుబీమాకు దరఖాస్తుల ఆహ్వానం
యాదగిరిగుట్ట రూరల్: రైతుబీమా పథకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు యాదగిరిగుట్ట డివిజన్ ఏడీఏ శాంతినిర్మల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1966 ఆగస్టు 14, 2007 ఆగస్టు 14 మధ్య జన్మించి, 2025 జూన్ 5వ తేదీ నాటికి కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు అర్హులన్నారు. ఈనెల 13న చివరి తేదీ అని.. రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులను దరఖాస్తు ఫారానికి జతచేసి సంబంధిత మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నేరుగా అందజేయాలని పేర్కొన్నారు. వివరాల కోసం మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.
యాదగిరి క్షేత్రంలోనిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శనివారం వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు చేశారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయంలో ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
నిండుకుండ.. నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. నాగార్జునసాగర్ గరిష్టస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు (312 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం సాగర్ జలాశ యం నీటిమట్టం 589.70 అడుగులు (311.1486 టీఎంసీలు)గా ఉంది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 65,530 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా కృష్ణా నదిలోకి 29,313 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, వరద, ఏఎమ్మార్పీ కాలువల ద్వారా మరో 15,577 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడం.. ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఆదివారం ఉదయం క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
మూసీకి వరద ఉధృతి
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 5,082 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు ఐదు క్రస్ట్‌గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 9,598 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. నీటిమట్టాన్ని 643.50 వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరద మొత్తం దిగువకు వదులుతున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 286 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.0 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు.