
రైతులు నష్టపోకుండా డబ్ల్యూడీఆర్‌ఏ ఏర్పాటు
అడ్డగూడూరు: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను తక్కువ ధరకు అమ్మి నష్టపోతూన్నారని, దీని నివారణకు భారత ప్రభుత్వం వేర్‌హౌజింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ(డబ్ల్యూడీఆర్‌ఏ) ఏర్పాటు చేసిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్(ఐసీఎం) ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్‌కుమార్ తెలిపారు. అడ్డగూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో డబ్ల్యూడీఆర్‌ఏపై సోమవారం రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర లేక, నిల్వ ఉంచుకునే పరిస్థితి లేక చేసిన అప్పులు తీర్చడానికి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్నారు. ఈ పరిస్థితిని నివారించి అధిక ధర వచ్చినప్పుడు పంటను అమ్ముకునే సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఎక్కడికక్కడ వేర్‌హౌసింగ్ గోదాములను ఏర్పాటు చేసిందన్నారు. అడ్డగూడూరు మండలంలో చౌల్లరామరం గ్రామంలో గోదాములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తాము పండిచిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఈ గోదాముల్లో నామమాత్ర రుసుముతో పంట నిల్వ చేసుకోవచ్చని సూచించారు. నిల్వ చేసిన పంటపై 80శాతం వరకు బ్యాంకులు తక్షణ రుణ సదుపాయం కల్పిస్తాయని తెలిపారు. అనంతరం చౌల్ల రామారంలోని గోదాముల వద్దకు రైతులను తీసుకెళ్లి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా రైతులకు శిక్షణ కిట్లు, మెటీరియల్, రూ.300 చొప్పున స్టైఫండ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఎం డైరెక్టర్ గణేషన్, యాదాద్రి భువనగిరి డీసీఓ శ్రీధర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామనర్సయ్య, సీనియర్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌కుమార్, సీఈఓ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య, మాజీ చైర్మన్(డైరెక్టర్) పొన్నాల వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు అశోక్‌రెడ్డి, పోగుల నర్సిరెడ్డి, వీరస్వామి, వేముల భిక్షం తదిరతులు పాల్గొన్నారు.
ఐసీఎం ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్‌కుమార్