
సమస్యలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్తా
చౌటుప్పల్ : ట్రిపుల్‌ఆర్ బాధితుల సమస్యలను కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రాంచందర్‌రావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రిపుల్‌ఆర్ భూ నిర్వాసితులు సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. బాధితులు మాట్లాడుతూ చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొక్కి ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చిందన్నారు. ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు నడుమ 40కిలోమీటర్ల దూరం ఉండాల్సి ఉన్నప్పటికీ కేవలం 28కిలోమీటర్లకే పరిమితం చేశారని వాపోయారు. కొంతమంది వ్యక్తులు, సంస్థల ప్రయోజనం కోసం ముందుగా రూపొందించిన అలైన్‌మెంట్‌ను మార్చారని ఆరోపించారు. తమకు జరుగుతున్న అన్యాయంపై మూడేళ్లుగా పోరాడుతున్నామని గుర్తుచేశారు. తమకు అధికారం వస్తే అలైన్‌మెంట్‌ను మారుస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ హామీ ఇచ్చారని తెలిపారు. ఆ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ సైతం హామీ ఇచ్చనట్లు గుర్తు చేశారు. అధికారం వచ్చాక తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా మరింత అన్యాయం చేస్తున్నారని వారు ధ్వజజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు మాట్లాడుతూ రైతులు, నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. ఉత్తర భాగంలోని సమస్యను మరోసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జాల వెంకటేష్‌యాదవ్, నాగవెల్లి దశరథగౌడ్ పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాంచందర్‌రావు
హైదరాబాద్‌లో వినతిపత్రం
అందజేసిన ట్రిపుల్‌ఆర్ భూ నిర్వాసితులు