
కృష్ణా జలాలు వృథాగా వదిలేస్తున్నారు
● నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ: కృష్ణా జలాలను వృథాగా సముద్రంలో వదిలేస్తున్నారు తప్ప జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందించడంలో లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం రైతులతో నల్ల గొండకు వచ్చిన ఆయన కలెక్టర్‌ను కలిసి భూములకు సాగునీరు అందించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాగర్ నుంచి పులిచింతల మీదుగా కృష్ణా జలాలను వృథాగా వదిలేస్తున్నారని.. నకిరేకల్, శాలిగౌరారం మండలాల్లోని పొలాలకు నీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బీసీలో 4 మోటార్లు ఉంటే 3 మోటార్లు నడుస్తున్నాయని, మిగతా మోటారు ఎందుకు నడవడం లేదన్నారు. బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి.. ప్రాజెక్టుకు ఒక రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. జిల్లాలో నీటిపారుదల మంత్రి ఉన్నా.. తాగు, సాగు నీరు సక్రమంగా అందకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికై నా ఎస్‌ఎల్‌బీసీ 4వ మోటారు నడిపి జిల్లాలోని చెరవులు, కుంటలు నింపాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుపోవడంపైనే దృష్టి పెట్టారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఆయన వెంట కొండూరు శంకర్‌గౌడ్, ప్రదీప్‌రెడ్డి, వడ్డె సైదిరెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, యానాల అశోక్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.