
ఆశయం లేనివాడే పేదవాడు
ఆలేరు: డబ్బులేని వాడు కాదు.. జీవితంలో ఆశయం లేనివాడే పేదవాడు అని స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకుసాగాలని హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానందజీ మహరాజ్ అన్నారు. సోమవారం ఆలేరు పట్టణంలోని శ్రీరామకృష్ణ విద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరి పైన ఆధారపడకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా తీర్చిదిద్దేందుకు యువత అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థి దశలోనే క్రమశిక్షణను అలవర్చుకోవడంతో జీవితం విలువ తెలుస్తుందన్నారు. సామాజిక స్పృహ, సేవాగుణం పెంపొందించుకోవడం వల్ల నాయకత్వ లక్షణాలు అబ్బుతాయన్నారు. స్వామి వివేకానంద, బుద్ధుడు, అబ్దుల్ కలాం లాంటి మహానీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాలక్షేపం, విలాస జీవితం, మత్తు పదార్థాలమయంగా సమాజం మారిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెడు ఆలోచనలు, అలవాట్లను ఆదిలోనే తుంచివేయాలని విద్యార్థులకు సూచించారు. శ్రీరామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్య బండిరాజుల శంకర్ మాట్లాడుతూ.. భారత సంస్కృ, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిన చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. అనంతరం బోధమయానందజీని బండిరాజుల శంకర్ ఘనంగా సన్మానించారు. క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు స్వామిజీ బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్వావలంబి భారత్ అభియాన్ కన్వీనర్ జి. రమేష్, పాఠశాల కార్యదర్శి తిరుపతమ్మ, ఆలేరు ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేష్, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శ సజన్‌కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం
అధ్యక్షుడు బోధమయానందజీ మహరాజ్

ఆశయం లేనివాడే పేదవాడు