
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
చింతపల్లి: మద్యానికి బానిసై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చింతపల్లి మండలం మదనాపురం గ్రామ సమీపంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం పాలెంతండా గ్రామానికి చెందిన సపావత్ రమేష్(40) మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉంటాడని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తండాకు వచ్చే దారిలో మదనాపురం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన మృతిచెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శరీరం డీ హైడ్రేషన్‌కు గురై మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న వల్లపు శ్రీనయ్య ఈ నెల 5వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనయ్య కుమారులు సోమవారం దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. శ్రీనయ్య ఇంటి నుంచి వెళ్లినప్పుడు నలుపు రంగు షర్ట్, తెల్ల లుంగి ధరించినట్లు తెలి పారు. ఆచూకీ తెలిసిన వారు 8712670154ను సంప్రదించాలని సూచించారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరామ ఫైనాన్స్ సమీపంలో గల ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు బూడిద రంగు ఆఫ్ షర్ట్, పెద్ద గల్లు గల లుంగీ ధరించి ఉన్నాడని, సుమారు 40 నుంచి 45 ఏళళ్ల వయస్సు కల్గి ఉంటాడని ఎస్‌ఐ తెలిపారు. మృతుడు కొంతకాలంగా గ్రామంలో భిక్షాటన చేస్తున్నాడని స్థానికులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712670189, 8712670151 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
చికిత్స పొందుతూ
యువకుడు మృతి
నాగారం: సూర్యాపేట– జనగామ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన గొలుసుల నరేష్(27), గొలుసుల ప్రశాంత్ (23) వరుసకు అన్నదమ్ముళ్లు. ఇద్దరు కలిసి ఆదివారం రాత్రి పని నిమిత్తం స్వగ్రామం నుంచి బైక్‌పై సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో నాగారం మండల పరిఽధిలోని ఫణిగిరి గ్రామ శివారులో సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రశాంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతులిద్దరు అవివా హితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ ఎం. ఐలయ్య తెలిపారు.