
గంజాయి నిందితుల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖరరాజు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం, ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన భూక్యా హనుమా నాయక్, సంగాల కాటంరాజు, నర్సారావుపేట జిల్లా కారంపుడికి చెందిన మద్దూరి చంటి గంజాయికి అలవాటు పడి ముఠాగా ఏర్పడ్డారు. బలిమెల, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆనంద్‌గురు వద్ద గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీరికి మిర్యాలగూడకు చెందిన కొందరు వ్యక్తులు పరిచయం కావడంతో వారి ద్వారా ఇక్కడకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఈక్రమంలో గురువారం భూక్యా హనుమానాయక్, సంగాల కాటంరాజు, మద్దూరి చంటి రెండు గ్రూపులుగా విడిపోయి చంటి బైక్‌పై మిర్యాలగూడ పట్టణానికి వచ్చి ఐదున్నర కిలోల గంజాయిని విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. మద్దూరి చంటి, మిర్యాలగూడకు చెందిన షేక్ రియాజ్, మహమ్మద్ హర్షత్ అయూబ్, మహ్మద్ సలీం అక్బర్, మహమ్మద్ జునైద్ అలీ, షేక్ అప్రోజ్, కుర్ర సందీప్ ఖానాపురం శరత్‌లను అరెస్టు చేశామని.. భూక్యా హనుమానాయక్, సంగాల కాటంరాజు, ఆనంద్‌గురు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల వద్ద 7.4 కిలోల గంజాయి, కారు, మూడు ద్విచక్ర వాహనాలు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో టూ టౌన్ సీఐ సోమనర్సయ్య, రూరల్ ఎస్‌ఐ లక్ష్మయ్య, టూటౌన్ ఎస్‌ఐ రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ ఎస్.యాదగిరిరెడ్డి, కానిస్టేబుళ్లు ఎల్.సూర్య, పి.బాలకృష్ణ, ఎండీ అక్బర్ పాష, జి.లక్ష్మయ్య, రాజశేఖర్, సమాద్, వెంకన్న, మహేష్, సైదులు, నాగరాజు, రాములునాయక్, సైదానాయక్ తదితరులున్నారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖరరాజు