
విషజ్వరాలతో విలవిల!
సాక్షి, యాదాద్రి : విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, చెత్తాచెదారం, మురుగు నీరు.. దీనికి దోమలు తోడై ప్రాణాంతక వ్యాధులను మోసుకొస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ప్రైవేట్ వైద్యశాలలు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పది రోజులుగా 600 వరకు ఓపీ నమోదవుతుండగా అందులో జ్వరంతో వచ్చే వారి సంఖ్య సగానికి పైనే ఉంటుంది.
ఉదయం నుంచే
కిక్కిరిసిపోతున్న ఓపీ విభాగం
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉదయం 9గంటల నుంచే ఓపీ విభాగం కిక్కిరిసిపోతోంది. డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో వచ్చిన రోగులు ఇన్‌పేషెంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. జ్వర నమూనా పరీక్షల కోసం ల్యాబ్‌కు క్యూ కడుతున్నారు. అయితే వ్యాధి నిర్ధారణ కోసం రెండు, మూడు రోజులు నిరీక్షించాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్ సౌకర్యం ఉన్నా సాయంత్రం వేళలో, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో సిబ్బంది ఉండటం లేదని వాపోతున్నారు. గత్యంతరం లేక ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. డెంగీ జ్వరానికి సకాలంలో వైద్యం చేయించుకుంటే ప్రమాదం వుండదు. ఇది సోకితే రోగి శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గడం సహజం. రక్తకణాల లెక్కింపునకు రోజూ పరీక్షలు చేయించుకోక తప్పని పరిస్థితి. ఇక ఎండోస్కోపిక్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తున్నారు. వేల రూపాయలు ఖర్చు అవుతుండడంతో పేదలతో పాటు మధ్య తరగతి రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేట్‌లోనూ ఫుల్
ప్రైవేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగీబారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. వారి వివరాలు వైద్యారోగ్య శాఖకు చేరడం లేదు. వీరితో పాటు వైరల్ ఫివర్ బాధితులు పెద్ద ఎత్తున ఉంటున్నారు. కొందరు హైదరాబాద్‌లోని ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
రోజూ 550 వరకు ఓపీ..
భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 350 నుంచి 400 వరకు ఓపీ ఉంటుంది. కానీ, పది రోజులుగా 550 వరకు ఓపీ పెరిగింది.
జనవరి నుంచి జ్వరపీడితులు ఇలా..
సాధారణ జ్వరం 18,493, డెంగీ 15, చికున్‌గున్యా 2, టైఫాయిడ్ కేసులు 3 నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ, వీరి సంఖ్య అనధికారికంగా వేలల్లో ఉంటుంది.
విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
ఫ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిట
ఫ ఓపీలో సగానికి పైగా జ్వరపీడితులే..
ఫ 15 డెంగీ కేసులు నమోదు
ఫ వైద్యారోగ్య శాఖ గణాంకాల్లో చేరనవి మరెన్నో..
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. డ్రెయినేజీల నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమల బెదడ పెరిగింది. అనారో గ్యంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నా అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా పట్ట ణాల్లో ఖాళీ స్థలాలు, ఇళ్ల మధ్యనే మురుగు నీరు ప్రవహిస్తోంది.

విషజ్వరాలతో విలవిల!