
లింగ నిర్ధారణ కేసులో ఆర్‌ఎంపీ అరెస్టు
సూర్యాపేటటౌన్ : వైద్యం వికటించి గర్భిణి మృతి చెందిన కేసులో ఆమెకు లింగ నిర్ధారణ పరీక్ష చేసిన ఆర్‌ఎంపీని పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ వెల్లడించారు. మే 24న మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన బయ్య అనూష అనే గర్భిణి నకిరేకల్‌లోని ఆర్‌ఎంపీ వైద్యుడు బాత్క యాదగిరి వద్ద లింగనిర్ధారణ పరీక్ష చేయించుకుంది. ఆడపిల్ల అని తేలడంతో ఆమె భర్త నగేష్ మరో ఆర్‌ఎంపీ జానయ్య, వారి బంధువు సందీప్ కలిసి ఆమెను సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు అర్హత లేని వైద్యులతో అబార్షన్ చేయించారు. అధిక రక్తస్రావం కావడంతో ఆమెను ఖమ్మంలోని మరో ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ఈవిషయమై డీఎంహెచ్‌ఓ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు ఆర్‌ఎంపీ బాత్క యాదగిరిని నకిరేకల్‌లోని తన నివాసంలో పట్టణ పోలీసులు అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. మొత్తం 10 మందిపై కేసు కాగా కొంత మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మరికొంత మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుడు యాదగిరి వద్ద ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్,
సెల్‌ఫోన్ స్వాధీనం