పెళ్లింట పసిడి గుబులు | - | Sakshi
Sakshi News home page

పెళ్లింట పసిడి గుబులు

Apr 24 2025 1:37 AM | Updated on Apr 24 2025 8:36 AM

పెళ్లింట పసిడి గుబులు

పెళ్లింట పసిడి గుబులు

రూ.లక్షకు చేరిన తులం బంగారం ధర

సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో ఆందోళన

కట్న, కానుకల కింద ఇచ్చే

బంగారం తగ్గించుకునే ఆలోచన

జిల్లా వ్యాప్తంగా తగ్గిన కొనుగోళ్లు

వెలవెలబోతున్న జ్యువెలరీ,

బంగారం షాపులు

సాక్షి, యాదాద్రి : ‘పెళ్లికి మా అమ్మాయికి ఎన్ని తు లాల బంగారం పెడతారు’ ఏయే నగలు ఇస్తారు?.. ‘మా అబ్బాయికి మీరెన్ని తులాలు పెడతారో చెప్పండి?’ పెళ్లి ఖాయం చేసుకున్నాక పెట్టిపోతల విషయంలో జరిగే చర్చల్లో సర్వసాధారణంగా వినిపించే మాటలివి.. కానీ, ఇప్పుడు పెళ్లి బడ్జెట్‌లో బంగారం ప్రస్తావన తెస్తేనే దడ పుడుతోంది. తులం బంగారం లక్ష రూపాయలకు చేరడంతో అన్ని వర్గాల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పసిడి పేరెత్తినే అమ్మో అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో పెరిగిన బంగారం ధర ఆయా వర్గాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వివాహాది శుభకార్యాలకు సిద్ధమవుతున్న కుటుంబాలు ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే అవకాశం ఉంది.

ఆడపిల్ల కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం

వచ్చే నెలనుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న కుటుంబాలు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. కట్నం కింద బంగారు ఆభరణాలు పెట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో బంగార ధర తులం రూ.లక్షకు చేరడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో గుబులు మొదలైంది. త్వరలో మరింత పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ప్రధానంగా ఆడపిల్లల తల్లిదండ్రలు వేదన వర్ణణాతీతం. ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేయలేకపోయామని మదనపడుతున్నారు.

భారీగా తగ్గిన కొనుగోళ్లు

బంగారం కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా 300కు పైగా బంగారం, జ్యువెలరీ షాపులు ఉన్నాయి. ధర తక్కువగా ఉన్నప్పుడు ఒక్కో దుకాణంలో రోజుకు సగటున పది తులాల బంగారం విక్రయించేవారు. ఇప్పుడు అందులో సగం కూడా వ్యాపారం జరగడం లేదని యజమానులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement