విద్యా వ్యవస్థలో పర్యవేక్షణ లోపం
మోత్కూరు : విద్యాశాఖలో ఇన్‌చార్జి అధికారులతో పర్యవేక్షణ లోపించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. అడిషనల్ కలెక్టర్లకు, సీఈవోలకు.. జిల్లా విద్యాశాఖ అధికారి బాధ్యతలు ఇవ్వడం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని అన్నారు. బుధవారం ఆయన మోత్కూరులో ప్రధానోపాధ్యాయుడు తీపిరెడ్డి గోపాల్‌రెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన సభలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అందక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 39 మంది చనిపోయారని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలు అందడం లేదన్నారు. ఉపాధ్యాయులు సర్వీసులో దాచుకున్న డబ్బులు సత్వరమే అందజేసే విధంగా చూడాలన్నారు. హెల్త్ కార్డులు అందజేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేసినప్పుడే చక్కగా చదువుకోగలుగుతారని అన్నారు. సర్వ శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, సంఘం నాయకులు దామోదర్‌రెడ్డి, కె.అమరేందర్‌రెడ్డి, గడసంతల మధుసూదన్, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి


