యువతలో ఉపాధి నైపుణ్యం
అడ్డగూడూరు : గ్రామీణ యువతకు ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు ఐటీఐ, ఏటీసీ సంస్థలతో యువతలో ఉపాధి నైపుణ్యం పెంపొందిస్తామని, మెరుగైన శిక్షణ ఇస్తామన్నారు. అడ్డగూడూరు మండల కేంద్రంలో రూ.47.11 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఐటీఐ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన సముదాయానికి బుధవారం ఆయన.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువతలో అడ్వాన్స్ టెక్నాలజి సెంటర్లతో స్కిల్స్ పెంచి వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఐటీఐ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో 540 మంది శిక్షకులు అవసరం ఉన్నారని, వారి నియామకం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి ఇచ్చారని తెలిపారు. ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలలో చదువుకునే విద్యార్థులకు ప్రతి నెల రూ.2వేలు ఉపకార వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. త్వరలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిరేకల్, మిర్యాలగూడ సెంటర్లలో ఐటీఐ, ఏటీసీ సెంటర్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే మందుల సామేల్ రెండు సంవత్సరాలలోనే తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి రూ.3,622 కోట్ల నిధులు తీసుకొచ్చారని అభినందించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. గంధమల్ల రిజర్వాయర్ నుంచి అడ్డగూడూరు, ధర్మారం వరకు గోదావరి జలాలను రప్పిస్తున్నామని అన్నారు. రాబోయే ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలును క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని విస్మరించిందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. అడ్డగూడూరు మండలం ధర్మారం, నాగారం మండలం వర్దమానుకోట గ్రామాల మధ్య బిక్కేరుపై బ్రిడ్జి నిర్మించాలని అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తుంగతుర్తిలో మరో ఐటీఐ కాలేజీ మంజూరు చేయాలని మంత్రి వివేక్‌ను ఎమ్మెల్యే సామేల్ కోరారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, భువనగిరి జిల్లా కలెక్టర్ వి.హన్మంతరావు, ఉపాధి కార్మిక శాఖ జాయింట్ డైరెక్టర్ నగేష్, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో శంకరయ్య, మోత్కూరు మార్కెట్ చైర్‌పర్సన్ విమల, వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, స్థానిక సర్పంచ్ పూజారి వనజసైదులు, ధర్మారం సర్పంచ్ మేకల మేరి ఆనంద్, సింగిల్‌విండో మాజీ చైర్మన్లు కొప్పుల నిరంజన్‌రెడ్డి, పేలపూడి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి, మార్కెట్ డైరెక్టర్లు బాలెంల విద్యాసాగర్, చిత్తలూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.
ఫ ఐటీఐ, ఏటీసీలతో
మెరుగైన శిక్షణ ఇస్తాం
ఫ కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్


