హైవే విస్తరణకు నిర్మాణాల కూల్చివేత
చౌటుప్పల్ : ఎల్‌బీనగర్ నుంచి దండుమల్కాపురం గ్రామ శివారులోని శ్రీ ఆందోల్‌మైసమ్మ దేవాలయం వరకు హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి విస్తరణ చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్‌పేటలో పలు నిర్మాణాలను కూల్చివేశారు. గ్రామంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన రాజకీయ పార్టీ జెండా దిమ్మెలు, బస్‌షెల్టర్‌తోపాటు మరికొన్ని నిర్మాణాలు తొలగించాల్సి ఉన్నా ప్రజలు అడ్డుపడుతుండడంతో సంబంధిత శాఖ అధికారులు ఇప్పటివరకు వెనుకడుగు వేశారు. ఎల్‌బీనగర్ నుంచి దండుమల్కాపురం గ్రామం వరకు చాలా సంవత్సరాల క్రితమే వంద ఫీట్ల వరకు ప్రభుత్వం భూసేకరణ చేసిందని, ఇప్పుడు చేపట్టిన నిర్మాణాలన్నీ అక్రమంగా జరిగాయని, పరిహారం ఇవ్వడం కుదరదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. కానీ ప్రజలు తమకు పరిహారం ఇవ్వకుండా విస్తరణ పనులు ఎలా చేపడుతారంటూ అడ్డుపడ్డారు. దీంతో వివాదం నెలకొని ఇంతకాలం ఆ ప్రాంతంలో పనులు ఆగిపోయాయి. తాజాగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో స్థానిక ఆర్డీఓ వెల్మ శేఖర్‌రెడ్డి, ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు బుధవారం తెల్లవారుజామున కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు.


