ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు షాక్‌

Aug 25 2026 1:39 AM | Updated on Aug 25 2026 1:39 AM

నిడమర్రు: ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సులైన బీఈడీ, డీఈడీలు పూర్తి చేసి, డీఎస్సీ రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో మంచి ర్యాంక్‌ సాధించి ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు, నేడు 30 ఏళ్ల సర్వీసు తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పాస్‌ కావాలంటూ సోమవారం విద్యాశాఖ ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నూతన విద్యాహక్కు చట్టం ప్రకారం ఇన్‌సర్వీస్‌ టీచర్లు సైతం టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నాటి నుంచి విద్యాహక్కు చట్టం–2009లో మార్పులు తేవాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. లేనిపక్షంలో పలు ముఖ్య డిమాండ్లతో ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం విజయనగరంలోని దాసన్నపేట బాలికల హైస్కూల్‌లో క్లస్టర్‌ కాంప్లెక్స్‌కు హాజరైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన కలిసి, టెట్‌ సమస్యపై పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. కానీ, తాజాగా జారీ చేసిన ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌లో ఆ వినతిపత్రంలోని ఏ ఒక్క డిమాండ్‌ను కూడా పట్టించుకోకపోవడం దారుణమంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

విద్యాహక్కు చట్టం సవరణపై పట్టు

నూతన విద్యా చట్టం–2009 ప్రకారం దేశంలో టెట్‌ విధానం అమల్లోకి వచ్చింది. టెట్‌ పాస్‌ అయితేనే డీఎస్సీ రాసేందుకు అర్హత లభిస్తుంది. దీంతో ఏపీ సర్కారు 2011 నుంచి టెట్‌ పరీక్ష నిర్వహిస్తోంది. అయితే, 2011కి ముందు ఈ నిబంధనపై స్పష్టత లేకపోవడంతో ఆ కాలానికి ముందు ఉద్యోగాలు పొందినవారు ఇంతవరకు టెట్‌ రాయలేదు. గత ఏడాది సుప్రీంకోర్టు విద్యాహక్కు చట్టం–2009ని పరిగణనలోకి తీసుకుని టెట్‌పై తీర్పు వెలువరించింది. రిటైర్మెంట్‌కు 5 ఏళ్లకంటే తక్కువ సర్వీస్‌ ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో 2028 ఆగస్టు 1వ తేదీలోపు ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. నాటి నుంచి విద్యాహక్కు చట్టం–2009 సెక్షన్‌ 23(1)ను సవరించాలని కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సాధ్యంకాని పక్షంలో ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌లో కులం, కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా 40 శాతం పాస్‌ మార్కులు ప్రకటించాలని, సీనియర్‌ టీచర్లకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తక్కువగా ఉంటుందని కాబట్టి ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని, ఏ సబ్జెక్టు టీచర్‌కు అదే సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. కానీ, తాజా నోటిఫికేషన్‌లో నిరుద్యోగ అభ్యర్థుల మార్గదర్శకాలు, సిలబస్‌ మాదిరిగానే ఇన్‌సర్వీస్‌ టీచర్లకు కూడా టెట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2011కి ముందు ఉద్యోగాలు పొందిన వారు సుమారు 35 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా. వీరందరి ఆశలను తాజా నోటిఫికేషన్‌ ఆవిరి చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్హత మార్కులు తగ్గింపు లేదు

ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఆయా సబ్జెక్టుల టెట్‌ పేపర్లలో ఉత్తీర్ణత తప్పనిసరి. నిరుద్యోగ అభ్యర్థుల మాదిరిగా తమకు టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ లేనందున, అందరికీ ఉమ్మడిగా ఒకే విధంగా అర్హత మార్కులు నిర్ణయించాలని సంఘాలు పట్టుపట్టినా ప్రయోజనం లేకపోయింది. ఈ నోటిఫికేషన్‌లో 150 మార్కులకు గాను ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు, బీసీలు 75 మార్కులు, జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ టీచర్లు 90 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు.

నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈ ప్రత్యేక టెట్‌కు ఇన్‌సర్వీస్‌ టీచర్ల నుంచి నేటి నుంచి విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబరు 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబరు 5వ తేదీ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అక్టోబర్‌ 11 నుంచి 21 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఎస్జీటీలు పేపర్‌–1 రాయాలి, పదోన్నతికి అర్హత సాధించాలంటే ఆయా సబ్జెక్టుల్లో పేపర్‌–2 రాయాలి. ప్రతి పేపర్‌కూ రూ.1,000 ఫీజు చెల్లించాలి.

మినహాయింపులు లేకుండానే ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌ జారీ

ఉద్యోగం ఉండాలంటే.. అర్హత పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి

నేటినుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

ఉపాధ్యాయుల డిమాండ్‌ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

నిరుద్యోగుల టెట్‌ మాదిరిగానే నిర్వహిస్తున్నట్లు ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement