న్యూస్‌రీల్
తూతూమంత్రంగా ఎకై ్సజ్ దాడులు
శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026
భీమవరం: జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వేళాపాళా లేకుండా నిత్యం మద్యం అందుబాటులో ఉండటంతో మందుబాబుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. గత రెండేళ్లుగా మద్యం మత్తులో దాడులు, హత్యలు జరిగిన సంఘటనలు జిల్లాలో చాలా ఉన్నాయి. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామంటూ ప్రచారం చేసి, నేడు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై ఎకై ్సజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
192 షాపులు.. 27 బార్లు..
ప్రస్తుతం జిల్లాలో సుమారు 192 బ్రాందీ షాపులు, 27 బార్లు ఉన్నాయి. ఒక్క భీమవరం పట్టణంలోనే 25 బ్రాందీ షాపులు, 6 బార్లలో విక్రయాలు సాగుతున్నాయి. ఇవే కాకుండా ప్రతి పట్టణం, పల్లెల్లో లెక్కలేనన్ని బెల్ట్ షాపులు వెలిశాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయించాలి. అయితే, నిర్వాహకులు ముందు భాగంలో ఉన్న షట్టర్లను మూసివేసి, వెనుక లేదా పక్క తలుపుల ద్వారా 24 గంటలూ విక్రయాలు జరుపుతున్నారు. దాదాపు ప్రతి మద్యం షాపు వద్ద సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా, అక్కడే మంచినీరు, కూల్‌డ్రింక్స్, స్నాక్స్ అందుబాటులో ఉంచుతుండటంతో మద్యం ప్రియులు షాపుల వద్దనే మద్యం సేవిస్తున్నారు.
సెప్టెంబర్‌తో ముగుస్తున్న టెండర్ల గడువు
ప్రభుత్వం నిర్వహించిన మద్యం టెండర్ల గడువు సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది. టెండర్ల సమయంలో అమ్మకాలపై 20 శాతం కమీషన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, షాపులు ప్రారంభించిన 10 నెలల వరకు కేవలం 8.5 శాతమే ఇవ్వడంతో యజమానులు ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం కమీషన్‌ను 14.5 శాతానికి పెంచింది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని యజమానులు వాపోతున్నారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ఎక్కువ ధరలకు అమ్మడమే కాకుండా, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు.
యానం మద్యం అక్రమ రవాణా
యానంలో ఎకై ్సజ్ డ్యూటీ తక్కువగా ఉండటంతో మద్యం తక్కువ ధరకు లభిస్తుంది. దీంతో జిల్లాలోని కొందరు వ్యాపారులు యానం నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించి ఇక్కడి షాపుల్లో విక్రయిస్తున్నారని సమాచారం. అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
24 గంటలూ అందుబాటులో మద్యం
బ్రాందీ షాపులు, బెల్ట్‌షాపుల్లో యథేచ్ఛగా విక్రయాలు
‘మామూళ్ల’ మత్తులో అధికారులు !
ప్రజాప్రతినిధులకూ వాటాలు
ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖకు అమ్మకాల టార్గెట్లు విధించడంతో అధికారులు పెద్ద ఎత్తున విక్రయాలు జరిగేలా చూస్తున్నారు. ఇందులో భాగంగానే 24 గంటల అమ్మకాలు, బెల్ట్షాపుల నిర్వహణ సాగుతున్నా ఎకై ్సజ్ శాఖ తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటోంది. బ్రాందీ షాపుల్లో నిరంతర అమ్మకాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడానికి నెలవారీ మామూళ్లే కారణమని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల కూడా అధికారులు షాపులపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మద్యం విక్రయాలపై కఠిన నియంత్రణ పాటించకపోతే శాంతిభద్రతల సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది.


