రోడ్డు ఇలా.. ప్రయాణమెలా? | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ఇలా.. ప్రయాణమెలా?

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

దారుణంగా కొత్తపూసలమర్రు – లోసరి రోడ్డు

నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం

భీమవరం అర్బన్‌ : మండలంలోని కొత్తపూసలమర్రు – లోసరి రోడ్డు ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర అవస్థలు కలిగిస్తోంది. కొత్తపూసలమర్రు శివారు నుంచి లోసరిలోని జాతీయ రహదారి 216ఏకి అనుసంధానంగా ఉండే ఈ రోడ్డు గోతులమయమై ప్రమాదాలకు నిలయంగా మారింది. భీమవరం, కాళ్ల మండలాల ప్రజలకు జాతీయ రహదారికి, కృష్ణా జిల్లాకు చేరుకునేందుకు ఇది అత్యంత దగ్గర మార్గం కావడంతో నిత్యం వందలాది స్కూల్‌ బస్సులు, ఆటోలు, కార్లు, చేపల లారీలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే సమీపంలోని చేపల మేత ఫ్యాక్టరీకి బరువైన లోడుతో వెళ్లే హెవీ లారీలు కూడా ఈ మార్గాన్నే వినియోగిస్తాయి.

ప్రజాధనం దుర్వినియోగం

సుమారు 4 కిలోమీటర్ల పొడవున్న ఈ కీలక రహదారికి ఇప్పటివరకు తారురోడ్డు వేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల క్రితం గ్రామీణులు, రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకుని వేసిన గ్రావెల్‌ రోడ్డే నేటికీ ఆధారంగా ఉంది. ప్రాముఖ్యత లేని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల స్వలాభం కోసం సీసీ రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తున్న సర్కారు, నిత్యం వేలాదిమంది ప్రయాణించే ఈ రహదారిని మాత్రం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.

చినుకు పడితే అస్తవ్యస్తం

కొద్దిపాటి వర్షానికే రోడ్డంతా బురదమయంగా మారి వాహనాలు దిగబడిపోతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించలేక కొందరు కొత్తపూసలమర్రు నుంచి గూట్లపాడు, తోకతిప్ప, బరువానిపేట మీదుగా సుమారు 12 కిలోమీటర్లు అదనంగా చుట్టూ తిరిగి జాతీయ రహదారికి వెళ్లాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, గెలిచాక మరచిపోవడం పరిపాటిగా మారిందని, ప్రజాప్రతినిధులు, ఇప్పటికై నా స్పందించి వెంటనే రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఈ రోడ్డు దుస్థితిపై ఆర్‌అండ్‌బీ ఏఈ రాజశేఖర్‌ను వివరణ కోరగా ఈ ఆర్‌అండ్‌బీ పరిధిలో లేదని, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. ఆ శాఖ రోడ్డును వేయాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement