గణపవరం: ఇంట్లోంచి వెళ్లిపోయిన ఓ మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలను ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే గణపవరం పోలీసులు సురక్షితంగా పట్టుకుని శుక్రవారం కుటుంబసభ్యులకు అప్పగించారు. వేగంగా స్పందించి ఆచూకీ కనిపెట్టిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ కొమ్మి శివప్రతాప్, డీఎస్పీ శ్రావణ్ కుమార్ అభినందించారు. ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం బువ్వనపల్లికి చెందిన అల్లు శాంతరాజు భార్య రాణి (26), కుమార్తెలు సిరిహాసిని (10), శృతి హర్షిణి (7), శ్రేష్ట (4)లతో కలిసి గణపవరం మండలం మొయ్యేరులోని బంధువుల ఇంటికి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారు ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. బంధువుల ఫిర్యాదుతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో, సీఐ నక్కా రజనీకుమర్ ఆధ్వర్యంలో ఎస్సై మణికుమార్, ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాల సహాయంతో వారు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మహిళ, పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగుండటంతో బంధువులకు అప్పగించారు. ప్రజలు ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ, 112 నంబరుకు గానీ సమాచారం ఇవ్వాలని సీఐ రజనీకుమార్ సూచించారు.


