ఎస్‌బీఐలో నకిలీ రుణాల కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐలో నకిలీ రుణాల కుంభకోణం

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

ఏలూరు టౌన్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణపవరం బ్రాంచ్‌లో నకిలీ వ్యవసాయ రుణాల పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు తూము కేశవ శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసి, రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏపీ సీఐడీ తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన తూము కేశవ శ్రీనివాస్‌... గత కొంతకాలంగా చేపల చెరువులు సాగుచేస్తున్నట్లు... తక్కువ విలువ భూములను, బ్యాంక్‌ ప్యానెల్‌ వాల్యూవర్స్‌తో అధిక విలువ చూపుతూ ఎస్‌బీఐ బ్యాంకు అధికారులతో కుమ్మకై ్క తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్ట్‌ నుంచి తప్పించుకుంటూ పరారీలో ఉన్న ప్రధాన నిందితుడ్ని సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.

వివరాలు ఇలా..

గణపవరం ఎస్‌బీఐ బ్రాంచ్‌లో నకిలీ వ్యవసాయ రుణాల కుంభకోణంపై క్రైమ్‌ నెంబర్‌ 18/2022 ఆఫ్‌ సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ ఎస్పీ ఆర్‌.గంగాధరరావు పర్యవేక్షణలో సీఐడీ విశాఖపట్నం ప్రత్యేక బృందం నిందితుడు తూము కేశవ శ్రీనివాస్‌ను ఈనెల 10న అరెస్ట్‌ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి ఎల్‌.వెంకటేశ్వరరావు నిందితుడికి జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించారు. నిందితుడ్ని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. రాజమహేంద్రవరం సీఐడీ ప్రాంతీయ కార్యాలయ అధికారులు క్రైమ్‌ నెంబర్‌ 34/2022 ఆఫ్‌ సీఐడీ పోలీస్‌స్టేషన్‌ కేసుపై ప్రధాన నిందితుడు తూము కేశవ శ్రీనివాస్‌ను పీటీ వారెంట్‌పై కేంద్ర కారాగారం నుంచి ఏసీబీ కోర్టులో గురువారం ప్రవేశపెట్టగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించారు. నిందితుడ్ని తిరిగి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించామని రాజమండ్రి సీఐడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో ఎస్‌బీఐ సిబ్బందిని గతంలోనే సీఐడీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇక భూమి విలువను ఎక్కువగా చూపించిన బ్యాంక్‌ ప్యానెల్‌ వాల్యూయర్స్‌ను త్వరలో అరెస్ట్‌ చేస్తామని సీఐడీ అధికారులు ప్రకటించారు. నిందితుడు శ్రీనివాస్‌పై నాలుగు కేసులు నమోదు అయ్యాయని స్పష్టం చేశారు. వీటితో పాటు మరికొన్ని కేసుల్లోనూ నిందితుడుగా ఉన్నట్లు... ఈ కేసుల్లో సుమారు రూ.1.70కోట్లు బ్యాంకును మోసం చేసినట్లు ఎస్‌బీఐ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ కేసుల్లో తూము భాస్కర శివకుమార్‌, తూము సత్యసోమ సుందరి, తూము నరేంద్రకుమార్‌, గోపిశెట్టి మాధురి, వీ.వనజాక్షి, వి.నరేంద్ర, కే.రామమోహనరావు, మరికొందరు ఉన్నారని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేసిన సీఐడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement