బుట్టాయగూడెం: గిరిజన ప్రాంత ప్రజలకు వైద్యులు, సిబ్బంది మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శోభ ఆదేశించారు. బుధవారం ఆమె పులిరామన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇటీవల మలేరియాతో మృతి చెందిన గిరిజన విద్యార్థిని మడకం నందిత (12) ఇంట్లో మరోసారి విచారణ చేపట్టారు. ఏజెన్సీలో మలేరియా మరణాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఫార్మసీ, ల్యాబ్, ప్రసూతి, అత్యవసర వార్డులను పరిశీలించి ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. తర్వాత కామయ్యకుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థిని మృతిపై విచారించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుమతి, డీఎంఓ ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


