ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలకు కొంతమేర వైద్యసేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్స్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరితో వ్యవహరిస్తూ వారి డిమాండ్లపై చర్యలు తీసుకోవటంలో జాప్యం చేస్తోంది. ఏపీ జూనియర్ డాక్టర్స్ అసొసియేషన్ (జూడ) రాష్ట్రవ్యాప్త పిలుపుతో ఏలూరు స ర్వజన ఆసుపత్రిలో జూడలు ఆందోళన బాటపట్టారు. జూనియర్ డాక్టర్స్ చేపట్టిన సమ్మె సోమవారం ఐదో రోజుకు చేరింది. ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ బ్లాక్ వద్ద ధర్నా, నిరసన దీక్ష చేపట్టారు. సాధారణ వైద్య సేవలకు సంబంధించి విధులను బహిష్కరించిన జూడలు, అత్యవసర వైద్య సేవలను అందిస్తూ వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ బోధనాసుపత్రి (జీజీహెచ్)లో జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలనీ, పదవీ విరమణ వయసు 62కు తగ్గించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.


