భీమవరం: భీమవరం పట్టణం తాడేపల్లిగూడెం రోడ్డులోని రైల్వే అండర్‌పాస్‌లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు 38వ వార్డు వీఆర్‌వో ఎం.మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్సై రెహ్మాన్ చెప్పారు. సుమారు 40 ఏళ్లు వయస్సు కలిగిన గుర్తుతెలియని పురుషుడు మృతిచెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బుట్టాయగూడెం: క్రీడలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను క్రీడల పట్ల ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలని గోపాలపురం ప్రభుత్వ వైద్యాధికారి పిన్నేంటి శ్రీదేవి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఈశా ఫౌండేషన్ గ్రామోత్సవ వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలకు రూ.10 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.7 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.5 వేలు, నాల్గో స్థానంలో నిలిచిన వారికి రూ.3 వేలు నగదుతో పాటు ట్రోఫీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాయల చదువర్ల సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్‌జేఎన్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఉండి: మండలంలో తరచూ ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. నిర్వహణ సరిగా లేకపోవడం, పాడైన రోడ్లతో బస్సులు రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. గత వారంలో ఉండి బస్టాండ్‌కు సమీపంలో ఏలూరు డిపోకు చెందిన బస్సు మొరాయించడంతో ప్రయాణికులు మరో దారి చూసుకోవాల్సి వచ్చింది. సోమవారం మండలంలోని కలిపూడి గ్రామంలో భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మొరాయించింది. ఏలూరు నుంచి భీమవరం వస్తున్న బస్సు ఇంజిన్‌లోని ఫ్యాన్ బెల్టు తెగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆటోల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు.
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆ సమస్యలు పరిష్కరించాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు యు.వెంకట పాండు రంగారావు అన్నారు. సోమవారం పట్టణంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును క్యాంపు కార్యాలయంలో జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాండు రంగారావు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. తమ సమస్యలను పరిష్కారం అయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పెన్మెత్స సాయివర్మ, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశం, యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: తణుకులో విద్యుత్ తీగలు చోరీకి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తణుకు పాతవూరులోని ఒక లే అవుట్‌లో ఉన్న విద్యుత్ స్తంభాలకు వేళాడుతున్న విద్యుత్ తీగలను చోరీ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఏఈ బండారు నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పట్టణ ఎస్సైసీహెచ్ సత్యనారాయణ కేసు నమోదుచేసినట్లు చెప్పారు. 150 మీటర్ల మేర తీగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


