31న అంగన్‌వాడీల ధర్నా | - | Sakshi
Sakshi News home page

31న అంగన్‌వాడీల ధర్నా

Jul 22 2026 2:17 AM | Updated on Jul 22 2026 2:17 AM

31న అంగన్‌వాడీల ధర్నా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి బైక్‌ అదుపు తప్పి చిరుద్యోగి మృతి

భీమవరం: అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, నవచేతన యాప్‌ రద్దు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈనెల 31న కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు అంగన్‌వాడీల అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి డి కల్యాణి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఐసీడీఎస్‌ ఏపీడీ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కల్యాణి మాట్లాడుతూ చిన్న పిల్లలు, పేద గర్భిణులకు, బాలింతలకు సేవ చేస్తున్న అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

భీమవరం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘భారత స్వాతంత్య్ర ఉద్యమం – మహనీయుల త్యాగఫలాలు’ అంశంపై జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొనవచ్చునన్నారు. వ్యాసం రెండు పేజీలకు మించకుండా స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపాల్‌ ధ్రువీకరణ పత్రం ఆగస్టు 8 వ తేదీలోగా గాంధీకస్తూరిబా భవనం, శ్రీరామపురం, భీమవరం–2, పశ్చిమగోదావరి జిల్లా అనే చిరునామాకు పోస్టల్‌ ద్వారా పంపించాలన్నారు. విజేతలకు ఆగస్టు 15వ తేదీ బహుమతులు అందజేస్తామన్నారు. వివరాలకు 99490 93115 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

తాడేపల్లిగూడెం ప్రతి విద్యార్థి ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కె.ధనుంజయరావు ఆకాంక్షించారు. ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరంలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్పార్క్‌ 3.0 ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ బూట్‌ క్యాంప్‌ను మంగళవారం ఉద్యాన కళాశాలలోని హార్టీ బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ భారతదేశంలో ఆధునిక ఆవిష్కరణలు పారిశ్రామికాభివృద్ధికి విశేష సేవలందించి రతన్‌ టాటా కృషిని స్మరించారు. గతంలో వివిధ విద్యాలయాల మధ్య ఏర్పడిన ఫలవంతమైన భాగస్వామ్యాలను ప్రస్తావిస్తూ, ఈ బూట్‌ క్యాంప్‌ ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఉద్యాన కళాశాల డీన్‌ బి.ప్రసన్నకుమార్‌, విద్యార్థి వ్యవహారాల డీన్‌ సి.మధుమతి, పారిశ్రామిక అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకురాలు టి.పద్మలత, కళాశాల అసోసియేట్‌ డీన్‌ ఎన్‌బీవీ చలపతిరావు, హెచ్‌బీఐసీ అధిపతి విస్తరణ విద్య ప్రొఫెసర్‌ ఇ.కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

భీమడోలు: బైక్‌ అదుపు తప్పిన ఘటనలో ఓ చిరుద్యోగి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఆరేటి హనుమకుమార్‌ (51) ఏలూరు సబ్‌రిజిస్టార్‌ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా జాతీయ రహదారి సూరప్పగూడెం ఫ్లైఓవర్‌ వద్దకు వచ్చేసరికి బైక్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమకుమార్‌ తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. భీమడోలు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement