ఖిలా వరంగల్: పంటలకు ఎంత ఎక్కువ యూరియా వేస్తే అంత అధికంగా దిగుబడులు వస్తాయనే అపోహతో మోతాదుకు మించి రైతులు చల్లేస్తున్నారు. ఈ రకమైన ధోరణి తీవ్ర అనర్థాలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. రైతులు అనుసరిస్తున్న పద్ధతులతో జీవజాలానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
ఎరువుల కొరత లేదు
జిల్లాలో వర్షాలు ఆలస్యంగా కురవడంతో వరి సాగు 50శాతానికి పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. అంచనా ప్రకారం 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 30వేల ఎకరాల వరకు వరినాట్లు వేశారు. గతేడాది ఇదే సమయానికి 90 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. గత వానాకాలం, యాసంగిని దృష్టిలో పెట్టుకుని యూరియా కొరత లేకుండా సరిపడా ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ వానాకాలం యూరియా 41,000 టన్నులు, డీఏపీ 17,500 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 6,500 టన్నులు, ఎంఓపీ 14,500 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 28,000 టన్నులు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకనుగుణంగా కావాల్సిన ఎరువులను దిగుమతి చేసుకుని గోదాముల్లో నిల్వ చేశారు. జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వలు అధికంగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
జరిగే నష్టం ఇలా..
యూరియా అధికంగా వాడటం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు భూములు క్రమంగా ఆమ్ల నేలలుగా మారి భూసారం దెబ్బతింటుంది. మొక్కలు ఏపుగా పెరిగినా ఆకులు లేతగా మారి తెగుళ్లు, పురుగు బెడద అధికమవుతుంది. దీంతో క్రిమిసంహారక మందులకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా కాండం బలహీనపడి కొద్దిపాటి గాలులు, వర్షాలకు పంట నేలవాలుతుంది. ఆకుల అధికంగా పెరిగి పూత, పిందె, గింజ తక్కువై దిగుబడులపై ప్రభావం చూపుతుంది. నేలలో జింక్, ఇనుము, సూక్ష్మ పోషకాల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. అవసరమైతే రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి. దీంతో భూమిలో సహజంగా లభించే పోషకాల స్థాయి తెలుస్తుంది. నేలల రకాలను బట్టి ఎంత మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాషియం వేసుకోవాలో తెలుస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
భూసారం దెబ్బతిని జీవజాలానికి ముప్పు
అందుబాటులో సరిపడా
యూరియా నిల్వలు
భూసార పరీక్షలు చేయించుకోవాలంటున్న వ్యవసాయాధికారులు
భూసారం దెబ్బతింటుంది
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. రైతులు వరిలో యూరియాను విడతల వారీగా విచ్చలవిడిగా చల్లుతున్నారు. దీంతో దీర్ఘకాలికంగా నేలలపై తీవ్ర ప్రభావం పడి భూసారం దెబ్బతినే అవకాశం ఉంది. గతేడాది అధిక మోతాదులో యూరియా వాడడం వల్లనే కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 41వేల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం.
– విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి


