● అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్
హన్మకొండ: జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు పాల్పడొద్దని, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఫల్యాలను చూసి కుంగిపోకుండా వాటిని అధిగమించి నిలిచి గెలిచినప్పుడే జీవితంలో నిజమైన ఘనత సాధించినట్లవుతుందని చెప్పారు. ఆత్మహత్యల నివారణ కమిటీ, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత 20 ఏళ్లుగా తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడటం గొప్ప విషయమన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తుల పట్ల సమాజం సానుభూతి, మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యుడు రాంపెల్లి లింగమూర్తి, భారతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


