● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
చెన్నారావుపేట: తెలంగాణ సాధనలో పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన ఉద్యమం బీఆర్‌ఎస్ ప్రతీ కార్యకర్తకు స్ఫూర్తి కావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇటీవల మృతిచెందగా, మండల కేంద్రంతో పాటు అమీనాబాద్ గ్రామంలో శనివారం సంతాపసభ, మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న, మండల కన్వీనర్ నాయకులు కొమ్ము రమేష్, జక్క అశోక్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాంరెడ్డి, పత్తినాయక్, సొసైటీ మాజీ అధ్యక్షుడు వంశీ, రవి, కుమారస్వామి, కుండె మల్లయ్య, ప్రదీప్ పాల్గొన్నారు.
పెద్ది సంస్మరణ సభకు ఏర్పాట్లు
నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభను మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి దేవాలయ ప్రాగణంలో ఈనెల 10న నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను అధిక సంఖ్యలో తరలించేలా సమీకరణపై నాయకులు దృష్టి సారించారు. సంస్మరణ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మండలాల వారీగా సమన్వయం చేస్తున్నారు. సభ ప్రాంగణంలో వేదిక, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాల కల్పనపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు సంస్మరణ సభ వివరాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.


