నేడే ముహూర్తం | - | Sakshi
Sakshi News home page

నేడే ముహూర్తం

Feb 16 2026 7:09 AM | Updated on Feb 16 2026 7:09 AM

నేడే ముహూర్తం

నేడే ముహూర్తం

నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

ఆయా మున్సిపల్‌ కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు సమావేశం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

వర్ధన్నపేట: పురపోరు తుది అంకానికి చేరుకుంది. నేడు (సోమవారం) మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నేడు (సోమవారం) ఉదయం 10 గంటల వరకు పాలకవర్గ సభ్యులు చేరుకోవాల్సి ఉంటుంది. అనంతరం పాలకవర్గ సభ్యులకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై అవగాహన కల్పిస్తారు. తదుపరి ఉదయం 11 గంటలకు చైర్మన్‌ ఎన్నికై న తర్వాత వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

వర్ధన్నపేట పీఠం ‘హస్తం’దే..

వర్ధన్నపేట మున్సిపాల్టీలో 12 వార్డులకు ఎన్నిక జరగగా 6 బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలుపొందారు. ఐదుగురు అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన వారు గెలుపొందగా 5వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శీభారాణి గెలుపొందారు. ఎక్స్‌అఫిషియో ఓటు ఎమ్మెల్యే నాగరాజు నమోదు చేసుకోవడంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బలం సమానంగా మారింది. దీంతో శీభారాణి మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇంత వరకు ఉత్కంఠగా మారిన వర్ధన్నపేట చైర్మన్‌ గిరికి తెరపడింది. శీభారాణి మద్దతుతో కాంగ్రెస్‌ బలం ఏడుకు పెరగడంతో కాంగ్రెస్‌ పీఠం వర్ధన్నపేట మున్సిపాలిటీ దక్కించుకున్నట్లయింది. శీభారాణి గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఇదే వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఒక్క ఓటుతో స్వతంత్ర అభ్యర్థి బానోతు అనితపై ఓడిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు తన ఆధిపత్యాన్ని చాటుకున్నట్లయింది. శీభారాణికి కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆమె తన మద్దతు తెలిపినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెకు చైర్‌పర్సన్‌ కావాలని కోరినట్లు తెలిసింది. చైర్‌పర్సన్‌ లేదా వైస్‌ చైర్మన్‌గా అవకాశం ఉంటుందని ప్రచారం కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement