బంజారాల మార్గదర్శి సేవాలాల్
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
● జిల్లావ్యాప్తంగా ఘనంగా సేవాలాల్ జయంతి
గీసుకొండ: సేవాలాల్ జయంతి సందర్భంగా జిల్లాలోని సంగెం, వర్ధన్నపేట, గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, పర్వతగిరి తదితర మండలాల వ్యాప్తంగా సేవాలాల్ చిత్రపటాలకు నివాళులర్పించారు. గీసుకొండ మండలం విశ్వనాథపురంలో ఆదివారం నిర్వహించిన జయంతి వేడుకలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. సద్గురు శ్రీ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం ఆదర్శనీయమని, బంజారాల ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలుస్తారన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి సేవాలాల్ గిరిజన హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. ఆయన కృషిని మరువలేమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మనపెల్లి శ్రీనివాస్, సర్పంచ్ దరావత్ జ్యోతి, నాయకులు తిరుపతి, కూసం రమేశ్, వీరాటి రవీందర్‌రెడ్డి, భద్రునాయక్, మణిగోపాల్, జన్ను రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


