మున్సిపాలిటీలు, రిజర్వేషన్లు, పార్టీల వారీగా రేసులో ఉన్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలు, రిజర్వేషన్లు, పార్టీల వారీగా రేసులో ఉన్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు

Feb 16 2026 8:01 AM | Updated on Feb 16 2026 8:01 AM

మున్సిపాలిటీలు, రిజర్వేషన్లు, పార్టీల వారీగా రేసులో ఉన్

మున్సిపాలిటీలు, రిజర్వేషన్లు, పార్టీల వారీగా రేసులో ఉన్

మున్సిపాలిటీలు, రిజర్వేషన్లు, పార్టీల వారీగా రేసులో ఉన్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఓరుగల్లు మున్సిపల్‌ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతంలో గంటగంటకో పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌కు 7, బీఆర్‌ఎస్‌కు ఒకచోట స్పష్టమైన మెజార్టీ వచ్చింది. వర్ధన్నపేట, మహబూబాబాద్‌, కేసముద్రం, జనగామలో హంగ్‌ ఏర్పడింది. హంగ్‌లో రెండు కాంగ్రెస్‌కు, రెండు బీఆర్‌ఎస్‌కు అనుకూలమన్న చర్చ ఫలితాల ఆధారంగా జరిగింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల ప్రకారం ‘ఎక్స్‌ అఫీషియో’ నిబంధనల మేరకు హంగ్‌ మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లే పరిస్థితి నెలకొనగా.. క్లియర్‌ మెజార్టీ ఉన్న తొర్రూరుపై సందిగ్ధం నెలకొంది. సోమవారం జరిగే మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఎన్నిక కానుండగా.. జనగామ, తొర్రూరు టాస్‌తో వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం కలకలం రేపుతోంది.

పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పెద్దలు..

పరకాల, ములుగు, భూపాలపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, డోర్నకల్‌, మరిపెడ, నర్సంపేట క్లియర్‌గా కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌కు దక్కనుందని గెలిచిన వార్డు సభ్యుల గణాంకాలు వెల్లడించాయి. మహబూబాబాద్‌, జనగామ, వర్ధన్నపేట, కేసముద్రంలో స్పష్టమైన మెజార్టీ లేక హంగ్‌లో చేరాయి. దీంతో ఎలాగైనా అత్యధిక స్థానాలను కై వసం చేసుకోవాలని భావించిన అధికార కాంగ్రెస్‌.. మంత్రులు, ముఖ్యనేతలను రంగంలోకి దింపిది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇన్‌చార్జ్‌లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్వర్వులను అనుకూలంగా మార్చుకుని ‘హంగ్‌’లలో ‘ఎక్స్‌అఫీషియో’ అస్త్రాన్ని ప్రయోగించాయి. దీంతో స్పష్టమైన మెజార్టీ ఉన్న ఏడు మున్సిపాలిటీలకు తోడు హంగ్‌లో ఉన్న నాలుగింటిని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పెద్దలు పావులు కదుపుతున్నారు. చివరకు బీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకున్న తొర్రూరు ఎన్నికను టాస్‌కు తెచ్చి వాయిదా వేసి ఆ తర్వాత కాంగ్రెస్‌ స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. స్పష్టమైన మెజార్టీ ఉన్న ఏడు మున్సిపాలిటీలతో పాటు హంగ్‌లో ఉన్న వర్ధన్నపేట, మహబూబాబాద్‌, కేసముద్రం కలిపి మొత్తం 10 మున్సిపాలిటీలను సోమవారం తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది.

ఎక్స్‌అఫీషియోతో ఫలితాలు తారుమారు

‘ఎక్స్‌అఫీషియో’ నిబంధనలు తెరపైకి వచ్చాక మున్సిపల్‌ ఎన్నికల పోరు రసకందాయంలో పడింది. ఎక్స్‌అఫీషియో ఓట్ల నమోదు తర్వాత ఫలితలు తారుమారయ్యాయి. జనగామ మున్సిపల్‌ పరిధిలో 30 వార్డులు ఉండగా, కాంగ్రెస్‌ 12, ఆ పార్టీ మద్దతుతో గెలిచిన సీపీఎం ఒక స్థానంతో 13 రాగా, బీఆర్‌ఎస్‌ కూడా 13 స్థానాలను గెలుచుకుంది. 5, 8, 15, 23 వార్డులో స్వతంత్రులు గెలిచారు. ఇందులో 8, 23 వార్డులకు సంబంధించి అభ్యర్థులు బీఆర్‌ఎస్‌ పక్షాన ఉండగా, 5, 15 వార్డులకు చెందిన అభ్యర్థులు కాంగ్రెస్‌కు మద్దతునివ్వడంతో రెండు పార్టీలకు 15ః15 వార్డులున్నాయి. దీంతో రెండు పార్టీలు ఎక్స్‌అఫీషియో ఓట్లపై ఆశలు పెట్టుకోగా.. కాంగ్రెస్‌ నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఓట్లు ఒకే కాగా, తలా 16 అయ్యాయి. దీంతో ఇక్కడ సోమవారం జరిగే ఎన్నికల సందర్భంగా టాస్‌ ఖాయం కానుండగా.. ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ లోపాయికారి ఒప్పందాలతో రెండు పార్టీలకు చెందిన ఒక్కరు, ఇద్దరు కౌన్సిలర్లు చేతులు ఎత్తకుండా ఉంటే మెజార్టీ స్థానాలున్న పార్టీకి చైర్మన్‌ పదవి దక్కే అవకాశం కూడా ఉంది. అలాగే, తొర్రూరు మున్సిపాలిటీ 16 వార్డుల్లో 9 గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చైర్మన్‌ ఖాయమనుకున్న తరుణంలో ఎడుగురు కౌన్సిలర్లున్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య ఇక్కడ ఎక్స్‌ అఫీషియోలుగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ ఖాతాలో పడిందనుకున్న తొర్రూరు కూడా టాస్‌కు చేరనుంది. ఎన్నిక ప్రక్రియ.. బలాబలాల ప్రదర్శన తర్వాత సమానంగా ఉంటే ఇక్కడ కూడా వాయిదా వేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement