నేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం
పరకాల: పరకాల మున్సిపల్ కొత్త పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి పరకాల మున్సిపల్ సమావేశ మందిరంలో కమిషనర్ ఎస్.అంజయ్య పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 22 మంది కౌన్సిలర్లు (13 కాంగ్రెస్, 6 బీఆర్‌ఎస్, 3 బీజేపీ) హాజరుకానున్నారు. అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌కు చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు దక్కనున్నాయి. చైర్మన్ పదవికి పావుశెట్టి సునీల్, వైస్‌చైర్మన్ పదవికి కొయ్యడ శ్రీనివాస్, బండి శ్రీధర్, పసుల లావణ్య, పొరండ్ల మౌనిక, బొచ్చు మాధవీలత, అల్లె దశరథం పోటీ పడుతున్నారు. వైస్ చైర్మన్ పదవికి పోటీ పెరిగిపోవడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పెద్దలు క్యాంపులో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తూనే, కౌన్సిలర్లు క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో ఉదయం 10.30 గంటకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. పరకాల ఆర్టీఓ డాక్టర్ కె.నారాయణ మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్త కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు చైర్మన్, వైస్‌చైర్మన్, నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల పరిధిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గూమిగూడడం నేరమని పరకాల సీఐ క్రాంతి కుమార్ పేర్కొన్నారు.
మున్సిపల్ కార్యాలయం లోపలికి ఎన్నికై న కౌన్సిలర్లు, కార్యాలయ ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉంటుంది. బయట వ్యక్తులు, ఎంపికై న వారి కుటుంబ సభ్యులు, పార్టీల నాయకులు, కార్యకర్తలకు అనుమతి లేదు. అదేవిధంగా అక్రిడిటేషన్, ఐడీ కార్డులు కలిగిన మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
– ఎస్.అంజయ్య, మున్సిపల్ కమిషనర్
పరకాల మున్సిపల్ కార్యాలయంలో అధికారుల ఏర్పాట్లు
క్యాంపు నుంచి నేరుగా చేరుకోనున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు
నేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం


