
వలకు చిక్కిన కొండచిలువ
నల్లబెల్లి: మండలంలోని రుద్రగూడెం శివారు గూడెం చెరువు మత్తడిలో కొండచిలువ కనిపించింది. గ్రామానికి చెందిన మత్స్యకారుడు మేడమీది రాజు చేపల కోసం బుధవారం రాత్రి కచ్చువల వేశాడు. గురువారం వెళ్లి చూసేసరికి కచ్చువలలో కొండచిలువ మృతి చెంది కనిపించింది. స్థానికులు మృతి చెందిన కొండచిలువను ఆసక్తిగా తిలకించారు.
గ్రామాలకు పంచాయతీ
కార్యదర్శుల నియామకం
నర్సంపేట: గ్రామాలకు డిప్యుటేషన్, ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ కలెక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం పంచాయతీ కార్యదర్శి బి.అవినాశ్‌ను జల్లి గ్రామానికి ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శిగా, బోడ మాణిక్యంతండా పంచాయతీ కార్యదర్శి కె.రంజిత్‌కుమార్‌ను చెరువుకొమ్ముతండా ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శిగా, ఖాదర్‌పేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్.వీరన్నను సంగెం మండలం నార్లవాయి పంచా యతీ కార్యదర్శిగా డిప్యుటేషన్,నార్లవాయి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.రమేశ్ ను ఖాదర్‌పేట పంచాయతీ కార్యదర్శిగా డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. కార్యదర్శులు వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు.
క్లీన్ ఓటరు జాబితాలు
తయారు చేయాలి : ఎమ్మెల్యే
వర్ధన్నపేట: గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించిన ఫొటో ఓటర్ల జాబితాలను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, వివిధ స్థాయిల పార్టీ శ్రేణులు పరిశీలించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30 వరకు అధికారులకు అందజేసి క్లీన్ ఓటరు జాబితాల తయారీకి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు స్వీకరించిన అభ్యంతరాలను 31న పంచాయతీలు, వార్డుల వారీగా గ్రామాల్లో ప్రదర్శిస్తారని, అనంతరం సవరించిన తుది ఓటరు జాబితాలను సెప్టెంబర్ 2న విడుదల చేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సాక్షి, వరంగల్: జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ వచ్చింది. చెరువుల్లోకి నీరు చేరడంతో వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు లేవని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం ఐదు గంటల వరకు వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. వర్ధన్నపేట 50 మిల్లీమీటర్లు, నల్లబెల్లి 42.9, దుగ్గొండి 37.3, నెక్కొండ 30.2, పర్వతగిరి 27.5, రాయపర్తి 26.5, ఖానాపురం 20.8, చెన్నారావుపేట 20, నర్సంపేట 17.8, సంగెం 15.3, వరంగల్ 12.5, గీసుకొండ 10.3, ఖిలావరంగల్‌లో 6.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎస్‌జీటీలకు
ఎస్‌ఏలుగా పదోన్నతి
విద్యారణ్యపురి: జిల్లాలో ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)గా పదోన్నతి కల్పిస్తూ గురువారం రాత్రి డీఈఓ రంగయ్యనాయుడు ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో 129 స్కూల్ అసిస్టెంట్ల కేటగిరీలో ఖాళీలు ఉన్నాయి. అందులో 47 మంది ఏస్‌ఏలకు అర్హులైన ఎస్‌జీటీలు లేకపోవడంతో 82 మంది ఎస్‌జీటీలకు 1:1 నిష్పత్తిలో వెబ్ ఆప్షన్లకు మంగళవారం రాత్రి అవకాశం కల్పించారు. కలెక్టర్ అప్రూవల్ మేరకు డీఈఓ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ అయ్యేందుకు 15 రోజుల సమయం ఉంటుంది. ఈనెల 29న ఎక్కువ మంది జాయిన్ అవుతారని భావిస్తున్నారు.
‘ఆర్టీసీని ప్రభుత్వంలో
విలీనం చేయాలి’
నర్సంపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గొలనకొండ వేణు గురువారం ఒక ప్రకటనలో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఆర్టీసీ కార్మికులు క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ విస్మరించడం బాధాకరం అన్నారు. ఆర్టీసీలో ప్రభుత్వ విలీనం 90 శాతం పూర్తయిందని, ఒకే ఒక్క కలం పోటుతో విలీనం తేదీ కోసం 40 వేల మంది ఆర్టీసీ కార్మికులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.