
అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు!
సంగెం: పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతోంది. అధికారులు దాడులు చేస్తున్నా.. కేసులు పెడుతున్నా.. అక్రమార్కులు కొత్త పంథాను ఎంచుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ధాన్యం మర ఆడించి బియ్యాన్ని ఇవ్వాల్సిన రైస్‌మిల్లర్లు ఆ ధాన్యాన్నే మింగేస్తున్నారు. సంగెం మండలంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)లో మిల్లర్ల తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈనెల 28న సంగెం మండల కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూళ్లూరుపేట నుంచి ఓ లారీ సుమారు 30 టన్నుల దొడ్డు బియ్యం మండలంలోని ఓ సీఎంఆర్ రైస్ మిల్లుకు తరలివేళ్తోంది. లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ఆధారంగా సంగెంకు వచ్చి మరో గ్రామానికి వెళ్తున్న క్రమంలో సంగెం పోలీస్‌స్టేషన్ దారి నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు వచ్చి అటు వెళ్లలేక తిప్పుతున్న క్రమంలో లారీ దిగబడింది. స్థానికులు ఆరా తీయడంతో దొడ్డుబియ్యం దందా వెలుగులోకి వచ్చింది. దిగబడిన లారీ డ్రైవర్ దొడ్డు బియ్యం దిగుమతి చేసుకునే మిల్లర్‌కు విషయం చేరవేయడంతో హుటాహుటిన డీసీఎం పెట్టి హమాలీల సాయంతో లారీలోని దొడ్డు బియ్యాన్ని మిల్లుకు తరలించుకుపోయాడు. ఈ విషయంపై స్థానికులు దొడ్డు బియ్యాన్ని మిల్లులో మర ఆడించి సన్నబియ్యంగా మార్చి సీఎంఆర్‌కు అప్పగిస్తున్నారని చర్చించుకుంటున్నారు.
మిల్లర్ల మాయాజాలం
ఆంధ్రా నుంచి దొడ్డు బియ్యం దిగుమతి,
మిల్లుల్లోని సన్న ధాన్యం ఎగుమతి
దిగబడిన లారీతో వెలుగులోకి
మిల్లర్ల అక్రమాలు
అధికారుల కనుసన్నల్లోనే
సాగుతున్నట్లు చర్చ