
రాజ్యలక్ష్మిని చేనులోనుంచి తీసుకొస్తున్న మహిళలు
నీరంతా మోటార్లతో తోడిన అధికారులు
చివరికి పత్తి చేనులో కనిపించిన వైనం
దుగ్గొండి: ఓ వృద్ధురాలు బావిలో పడిందని భావించి.. అధికారులు భారీ మోటార్ల సాయంతో నీటిని తోడేశారు. చివరికి వృద్ధురాలు పత్తి చేనులో కనిపించింది. ఈ సంఘటన ఆదివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో జరిగింది. దుగ్గొండికి చెందిన మాడిశెట్టి రాజ్యలక్ష్మి అనే 75 ఏళ్ల వృద్ధురాలు ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
ఉదయం ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అంతటా వెదికారు. ఓ వ్యవసాయ బావి (agricultural well) వద్ద వృద్ధురాలి చీర, బావిలోకి జారిన గుర్తులు కనిపించాయి. దీంతో ఆమె బావిలోనే పడిందని భావించిన కుటుంబ సభ్యులు అధికారుల సాయంతో ఐదు విద్యుత్ మోటార్లు, ఫైరింజన్‌తో నీటినంతా తోడేశారు. సాయంత్రం వరకు వృద్ధురాలికోసం గాలిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో గాలింపు చర్యలను చూడడానికి అక్కడికి వెళ్లిన కొందరు యువకులు.. మూత్ర విసర్జన కోసం సమీపంలోని పత్తి చేను లోపలికి వెళ్లారు. అక్కడ పత్తి మొక్కల మధ్య రాజ్యలక్ష్మి నిద్రపోతూ కనిపించింది. ఇది గమనించిన యువకులు వృద్ధురాలిని నిద్రలేపి చేనులో నుంచి బయటికి తీసుకొచ్చారు. రాజ్యలక్ష్మికి మతిమరుపు సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక, గ్రామ పంచాయతీ సిబ్బంది దాదాపు 100 మంది వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రమించారు.
చదవండి: నేరుగా రైతులతో మాట్లాడిన గణపయ్య!