
గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాయపర్తి: గ్రామాల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ రాంరెడ్డి తెలిపారు. మండలంలోని మైలారం, జగన్నాథపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన స్థలాన్ని ఏడీఆర్‌డీఓ రేణుకాదేవితో కలిసి శనివారం పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల కోసం స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, మండల అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో డీపీఎం దాసు, ఏపీఎం రవీందర్, సీసీలు స్వామి, సుధాకర్, ఎంఎస్ అధ్యక్షురాలు నీరజ, వీఓఏ నాగమణి, చందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
హత్య కేసులో
నిందితుడి అరెస్ట్
నల్లబెల్లి: హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై గోవర్ధన్‌తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 15న రాత్రి కొండాపూర్ గ్రామానికి చెందిన మేరుగుర్తి రమేశ్ ఇంటి జాగ పంచి ఇవ్వాలని తల్లి సమ్మక్కతో వాదనకు దిగాడు. అదే సమయంలో తమ్ముడు సురేశ్ అప్పుగా ఇచ్చిన రూ.10 వేలు అన్న ఇవ్వడం లేదు. పైగా అమ్మతో గొడవెందుకు పడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అన్నదమ్ముల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన సురేశ్ కత్తితో రమేశ్‌పై దాడి చేస్తుండగా.. రమేశ్ భార్య స్వరూప అడ్డుకుంది. దీంతో ఆమైపె కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. గాయపడిన రమేశ్, స్వరూపను స్థానికులు 108 వాహనంలో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప అదే రోజు రాత్రి మృతి చెందగా రమేశ్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. చేసిన నేరాన్ని అంగీకరించడంతో శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
పందెం కోళ్ల అపహరణ
ఖానాపురం: మండలంలోని పెద్దమ్మగడ్డలో పందెం కోళ్లను అపహరించుకెళ్లిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచం వెంకన్న ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆగంతకులు బయట తలుపులు బిగించారు. ఇంటి ఆవరణలో ఉన్న రూ.20 వేల విలువ చేసే 6 పందెం కోళ్లను దొంగిలించారు. తెల్లవారిన తర్వాత వెంకన్న ఇంటి తలుపులు తీయగా రాలేదు. చుట్టుపక్కల వారి సహకారంతో బయటకు వచ్చి చూడగా కోళ్లు దొంగతనం చేసినట్లు గుర్తించాడు. ఇటీవల వల్లెపు ఎల్లయ్య ఇంట్లోనూ పందెం కోళ్లను చోరీ చేశారు. దొంగతనంపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వెంకన్న తెలిపాడు.

గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు