
రైతుల కష్టం.. వ్యాపారులకు లాభం
● అధిక వర్షాలకు దెబ్బతిన్న
బంతిపూల తోటలు
● కిలోకు రూ.50 మాత్రమే
చెల్లించడంతో నష్టాలు
గీసుకొండ: జిల్లాలో బంతిపూల తోటలు సాగు చేసిన రైతుల కష్టం వ్యాపారులకు లాభదాయకంగా మారింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 20 ఎకరాల్లో బంతి తోటలు వేశారు. అధిక వర్షాలకు తోటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలు తోటల్లో పూలు వర్షాలకు కుళ్లిపోయాయని రైతులు చెబుతున్నారు. అలాగే, బంతి పూలను తెంపడానికి కూలీలు సరిగా రావడం లేదు. చాలా మంది పత్తి ఏరడానికి వెళ్తుండటంతో చేతికొచ్చిన పూలను మార్కెట్‌లో అమ్మడానికి తీసుకుని వెళ్లడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. ఈ ఏడాది గణపతి, దుర్గామాత నవరాత్రులు, దసరా ఉత్సవాలకు బంతిపూలకు బాగానే గిరాకీ ఉంది. వరంగల్ నగరంలోని వ్యాపారులు కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు కొనుగోలు చేసి పండుగ సమయాల్లో కిలోకు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈసారి దీపావళి నోముల సందర్భంగా బంతి పూల అవసరం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో రైతుల నుంచి వ్యాపారులు కిలో బంతి పూలను రూ.40 నుంచి రూ.50 లోపు కొనుగోలు చేసి రూ.100 నుంచి 120కి పైగా అమ్మడానికి సిద్ధమవుతున్నారు.
కిలోకు రూ.80 చెల్లిస్తేనే గిట్టుబాటు
తన ఎకరం చేనులో బంతిపూల పంట సాగు చేస్తే వర్షాలతో దెబ్బతింది. పెట్టిన పెట్టుబడి మినహా లాభం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మార్కెట్‌లో కిలో పూలకు రూ.80 వరకు వ్యాపారులు చెల్లిస్తే తమకు కొంత గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. దీపావళి పండుగ ముగిసిన వెంటనే పంటను తొలగించి వేరే పంట సాగుచేస్తా .
– ఎరుకల ప్రవీణ్, గంగదేవిపల్లి రైతు

రైతుల కష్టం.. వ్యాపారులకు లాభం