
బీసీ జేఏసీ బంద్ సక్సెస్
– మరిన్ని ఫొటోలు 11లోu
వరంగల్ చౌరస్తా: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చి పిలుపుమేరకు శనివారం జిల్లాలో బంద్ విజయవంతమైంది. వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో బీసీ, ప్రజాసంఘాలు, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ర్యాలీలు, నినాదాలతో హోరెత్తించారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్, రహదారులు, కూడళ్లు బోసిపోయి కనిపించాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా : బీజేపీ
బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ స్పష్టం చేశారు. వరంగలో జరిగిన బంద్‌లో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బీసీలపై రేవంత్‌రెడ్డి సర్కారుది కపట ప్రేమ అని విమర్శించారు. నాడు జయలలిత తమిళనాడులో 9వ షెడ్యూల్ ప్రకారం 58% శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు.
బంద్‌కు బీజేపీ మద్దతు సిగ్గుచేటు : వామపక్షాలు
బీసీ జేఏసీ బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని వామపక్షాల నాయకులు విమర్శించారు. వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పార్టీలు ద్వంద్వ విధానాలను విడనాడాలని ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి, రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు.
తెగించి పోరాడుదాం..
బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి పోరాడుదామని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా వరంగల్ శివనగర్‌లోని తమ్మెర భవన్ నుంచి సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరి అండర్ బ్రిడ్జి రోడ్డు, స్టేషన్ రోడ్డు, పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి నాయకులు మేకల రవి, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, గన్నారపు రమేశ్, నేతలు పాల్గొన్నారు.
సీపీఎం నాయకుల ప్రదర్శన..
సీపీఎం నాయకులు వరంగల్ పోస్టాఫీస్ సెంటర్ నుంచి వరంగల్ చౌరస్తా, బట్టలబజార్, బీట్ బజారులో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అరూరి రమేశ్, జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకమాడుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుల ర్యాలీ..
వరంగల్ ఎంజీఎం, పోచమ్మమైదాన్, మండిబజారు, ఆర్‌ఎన్టీ రోడ్డు, వరంగల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు రాజనాల శ్రీహరి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
జిల్లాలో ఎక్కడికక్కడ
నిలిచిపోయిన రవాణా వ్యవస్థ
స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య,
విద్యా సంస్థల మూసివేత
కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల
నాయకుల ర్యాలీలు, రాస్తారోకోలు
నర్సంపేట : పట్టణంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, వామపక్ష, టీజేఎస్, పలు కుల సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
చెన్నారావుపేట : బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు.
దుగ్గొండి : గిర్నిబావిలోని నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
నల్లబెల్లి : తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేశారు. మండల కేంద్రంలో కాంగ్రెస్, బీసీ సంఘాల నాయకులు నిరసన తెలిపారు.
ఖానాపురం : బీఆర్‌ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయాన్ని మూసివేశారు. కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు.
నెక్కొండ : రాజకీయ, కుల, యువజన సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు వేర్వేరుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు.
రాయపర్తి : మండల కేంద్రంలోని దుకాణాలను రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు మూసివేయించారు.
వర్ధన్నపేట : పట్టణంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించారు.
పర్వతగిరి : కిరాణాషాపులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేశారు.
సంగెం : మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.
గీసుకొండ : స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పలు పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహించారు.

బీసీ జేఏసీ బంద్ సక్సెస్

బీసీ జేఏసీ బంద్ సక్సెస్