
నేడు నరకాసుర వధ
సాక్షి, వరంగల్ /ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం నరకాసుర వధ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలతో డీసీపీలు, ఏసీపీ శుభం ప్రకాశ్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నా యి. ప్రత్యేకంగా వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పా టు చేశారు. అధికారుల సహకారంతో చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ శుభం ప్రకాశ్, ఉత్సవకమిటీ అధ్యక్షుడు మరుపల్లి రవి, ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేష్, ఏఈ సుకృత, తహసీల్దార్ ఇక్బాల్, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పరిశీలించారు.
23 ఏళ్లుగా..
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో గత 23 ఏళ్లుగా నరకాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం కరీమాబాద్ ఉర్సు ప్రతాప్‌నగర్ నుంచి శ్రీకృష్ణ సత్యభామ ఉత్సవ మూర్తులు, పిల్లల వేషధారణతో భారీ ఊరేగింపుతో రంగలీల మైదానానికి చేరుకుంటారు. అక్కడే శ్రీకృష్ణ, సత్యభామ డిజిటల్ బొమ్మలను ఏర్పాటు చేయగా.. బాణసంచాతో కాల్చే పక్రియను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఈఏడాది 58 అడుగుల నరకాసుర ప్రతిమను సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6గంటలకు వేదికపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రాత్రి 8గంటలకు నరకాసుర ప్రతిమను మంత్రి కొండా సురేఖ స్విచ్ ఆన్‌చేయగానే శక్తివంతమైన బాణసంచాతో దహనమవుతుందని నిర్వాహకులు తెలిపారు.
ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు..
నరకాసుర ప్రతిమ దహనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాలప్రకారం వేదిక, బారీకేడ్లు నాలుగు వైపులా పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపడుతున్నాం.
– శుభం ప్రకాశ్ ఏఎస్పీ, వరంగల్
వరంగల్ రంగలీల మైదానంలో 58 అడుగుల ప్రతిమ ఏర్పాటు
సాయంత్రం 6 గంటల నుంచి
వేదికపై సాంస్కృతిక కార్యక్ర మాలు
మంత్రి సురేఖ చేతుల మీదుగా
స్విచ్ ఆన్ చేసి దహనం