
తమ దగ్గరికి వచ్చిన వినాయకుడికి మొరపెట్టుకున్న రైతులు
రోజుల తరబడి తిరుగుతున్నా బస్తాకూడా దొరకడం లేదని ఆవేదన
నవరాత్రి ఉత్సవాల వేళ ఉమ్మడి జిల్లా రైతుల చెంతకు..!
క్యూ లైన్లో కర్షకుల కష్టాలు చూసి చలించిన గణపయ్య
(వరంగల్ డెస్క్): చవితి రోజు ఘనంగా పూజలందుకున్నాడు వినాయకుడు. రైతులు ప్రేమగా తెచ్చిన పత్రి, పూలు ఒంటినిండా ధరించాడు. పండ్లు, ఉండ్రాళ్లు బొజ్జ నిండా తిన్నాడు. కుటుంబ సమేతంగా వచ్చిన రైతు దంపతులను చూసి మురిసిపోయాడు. తెల్లవారి సైతం అదే రీతిన ప్రసాదాలు, పండ్లు అందాయి. కానీ.. మనసులో ఏదో వెలితి.
అప్పుడు వినాయకుడు మూషిక రాజు చెవిని మెలిపెడుతూ..
‘మూషికా.. నిన్న భక్తజన సందోహంతో నిండిన మండపాల్ని చూసి మురిసిపోయా.. ఇలా తెల్లారిందో లేదో పల్లెల్లోని మండపాలన్నీ వెలవెలబోతున్నాయి. రైతులు, అమ్మలు, అక్కలంతా ఎటుపోయారు? ఒక్కరూ కనిపించరేం..? రైతన్నలెందుకు పూజకు రాలేదో చూసి రాపో’ అన్నాడు. (గంట తరువాత) ‘స్వామీ.. రైతులు కుటుంబంతో సహా యూరియా కోసం సొసైటీ కార్యాలయాల వద్ద ఉంటున్నారు.. అయినా దొరకట్లేదట.. ఆందోళనలు చేస్తున్నారు.. అని బాధపడుతూ సమాధానమిచ్చాడు. ‘నా రైతులు ఇంతగనం కష్టాలు పడుతున్నారా.. వారి కష్టాలు తెలుసుకుందాం పద’ అన్నాడు. ‘నా భుజంపై ఎక్కండి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల దగ్గరికి తీసుకెళ్తా’ అంటూ సమాధానమిచ్చాడు మూషిక రాజు. సరే పదా.. అంటూ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి వారి ప్రయాణం మొదలైంది.
రైతుల పంటలను చూసుకుంటూ వెళ్తున్నారు. జిట్టెగూడెం గ్రామంలో ఓ రైతు కనిపించాడు. అక్కడే ఆగిన వినాయకుడు.. ఆ రైతును పలకరించాడు.
ఏమయ్యా.. నీ పేరేమిటీ?
స్వామి.. నాపేరు లకావత్ సురేందర్
వినాయకుడు: పొలం ఎట్లుంది? యూరియా దొరకట్లే..
సురేందర్: స్వామి నాకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఐదెకరాలు వరి, ఒక ఎకరం పత్తి సాగు చేస్తున్నా. యూరియా బస్తాల కోసం పదిరోజుల నుంచి పనులు వదులుకుని రోజూ ఘన్‌పూర్‌కు వస్తున్నా. ఘన్‌పూర్ ఆగ్రోస్ సెంటర్‌లో శుక్రవారం స్టాక్ వచ్చిందని తెలుసుకుని ఉదయం వెళ్లా. మధ్యాహ్నం వరకు ఎండలో లైన్‌లో ఉన్నా యూరియా దొరకలేదు. లాభం లేదని ఇంటికి వచ్చా. ‘అయ్యో.. సురేందర్.. ఇన్ని కష్టాలా’.. అని అనుకుంటూ వినాయకుడు తన మూషికాన్ని కదిలిస్తూ మరో ఊరికి బయల్దేరాడు.
చల్వాయినుంచి పోదాం అంటూ బయలుదేరిన వినాయకుడికి మార్గమధ్యలో హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లిలో ఓ రైతును పలకరించాడు.
వినాయక : రైతన్నా నీపేరేంది?..
రైతు : ఓదెల కొమురయ్య స్వామి..
వినాయక : దిగులుగా ఉన్నావు ఏమైంది.. పొలానికి వెళ్లలే..
కొమురయ్య : యూరియా దొరకడం లేదయ్యా.. వారం రోజుల క్రితం పరకాల పీఎసీఎస్‌లో ఇచ్చారు. ఇప్పుడు అడిగితే మాదారం సొసైటీ వారు సంబంధిత గ్రామాల రైతులకు ఇస్తున్నారు. పరకాల సొసైటీకి ఎప్పుడు వస్తదని అడిగితే ఆర్డర్ పెట్టినం అంటున్నారే తప్ప రావడం లేదు. బజార్‌లో వ్యాపారస్తులు అమ్ముకోవడానికి యూరియా ఉంటుంది కానీ వారు లింక్‌లు పెట్టి అమ్ముతున్నారు.
వినాయక :అవునా.. ఏమిటీ మూషికా.. ఏ రైతన్నను పలకరించినా ఒకటే సమస్య.. వీరి కష్టాలు త్వరగా తీరాలి.. ముఖంలో నవ్వు రావాలి అంటూ తన మండపానికి వెళ్లారు.
మహబూబాద్ జిల్లా కురవి మండలం ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం వద్ద చేతిలో చిట్టీ పట్టుకుని తిరుగుతున్న మోద్గులగూడేనికి చెందిన రైతు కొత్త వెంకన్నగౌడ్‌ను ఆపి ‘ఎందుకలా తిరుగుతున్నావ్. ఏంటి సమస్య’ అని ప్రశ్నించాడు వినాయకుడు
వెంకన్నగౌడ్: స్వామీ.. నేను మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. పంట కోసం ఆరు బస్తాల యూరియా కావాలి. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా దొరకలేదు. వారం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా. కష్టపడి కూపన్ సంపాదించా. కూపన్ చేతికొచ్చినా యూరియా అందలేదు. మరో రెండు రోజుల్లో లారీ వస్తుందని చెబుతున్నారు. అప్పుడైనా దొరుకుతుందో లేదో’ అని నిట్టూరుస్తూ సమాధానమిచ్చాడు. ‘దేశానికి అన్నంపెట్టే రైతుకే ఇన్ని కష్టాలా?’ అనుకుంటూ ముందుకు సాగారు మూషికరాజు, వినాయకుడు. నేరుగా.. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామానికి చేరుకున్నారు.
అరుగుపై దిగాలుగా కూర్చున్న కృష్ణారెడ్డిని పలకరిస్తూ..
వినాయకుడు : ఎందుకిలా దిగాలుగా కూర్చున్నావు?
కృష్ణారెడ్డి: 16 ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజుల క్రితమే పంటకు యూరియా వేయాలి. కొరత కారణంగా ఇప్పటి వరకు వేయలేదు. అదిగో, ఇదిగో బస్తాలు వస్తున్నాయంటూ అధికారులు రైతులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికీ నాలుగు సార్లు క్యూలైన్‌లో నిల్చుంటే ప్రతీసారి ఒకటి లేదా రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పంటలకు సరిపడా యూరియా ఇవ్వట్లేదు. అధికారులు సరిపడా యూరియా పంపిణీ చేస్తారనే ఆశ కూడా రైతుల్లో లేదు. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. అని చెప్పగానే. ఇంతదారుణమా అంటూ అక్కడినుంచి వినాయక స్వామి పరకాల మీదుగా వెళ్దామని బయలుదేరారు.
భళా.. ఏమిటీ ఇక్కడి రైతులంతా ఆనందంగా ఉన్నట్టున్నారే.. అన్ని చోట్లా కనిపించినట్లు. ఇక్కడ క్యూలైన్ లేదు. తోపులాట లేదు. పోలీసుల హడావిడి లేదు అంటూ.. నల్లబెల్లి మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట నుంచి వెళ్లిపోబోయాడు వినాయకుడు. అప్పుడే ఒక రైతు కాళ్లీడుస్తూ.. పీఏసీఎస్ వైపు రావడం గమనించారు.
‘ఏంటయ్యా.. ఇక్కడ యూరియా కొరత లేనట్టుంది. నువ్వెటు వెళ్తున్నావ్’ అని నల్లబెల్లి మండలం గోవిందాపూర్ శివారు ఎర్రచెరువు తండాకు చెందిన పాడ్యా బాలును అడిగాడు వినాయకుడు.
బాలు: ఈ సీజన్‌లో మూడెకరాల్లో వరి, మరో మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. యూరియా కోసం 12 రోజులుగా తిరుగుతున్నా. మండలంలో ఏషాపునకు వెళ్లినా యూరియా లేదు. అయిపోయిందని చెబుతున్నారు. స్టాక్ లేదని చెబుతున్నా.. ఒక్క బస్తా అయినా దొరుకుతుందేమోనని రోజూ పీఏసీఎస్‌కు వచ్చి పోతున్నా.’ అని సమాధానమిచ్చాడు. .. రైతులకు యూరియా కష్టాలు తీరేదెన్నడో అంటూ ముందుకు కదిలాడు వినాయకుడు.
సూర్యుడు నడినెత్తిమీదికొచ్చేసరికి వినాయకుడు గూడూరు మండల కేంద్రానికి చేరుకున్నాడు. పీఏసీఎస్ గోదాం వద్ద లైన్‌లో నిల్చున్న మర్రిమిట్టలోని బందాలగడ్డ తండాకు చెందిన భూక్య హేమ్లానాయక్‌ను పలకరించాడు.
వినాయకుడు: ఏమిటీ హుషారుగా ఉండేవాడివి.. నిస్సత్తువగా కనిపిస్తున్నావ్.
హేమ్లానాయక్: ఏం చెప్పాలి స్వామి. ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజులవుతోంది. ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా యూరియా దొరకలేదు. 10 రోజులుగా నిత్యం నా భార్య, నేనూ యూరియా కోసం వస్తున్నాం. తీసుకున్న వాళ్లే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. మా లాంటి వాళ్లను పట్టించుకునేటోళ్లు లేరు. కనీసం ఎకరానికి ఒక బస్తా చొప్పున 6 బస్తాలు కావాలి. ఏం చేయాలో తోచట్లేదు. లైన్‌లో నిలబడి, రాత్రి, పగలు తిరుగుతూ ఉంటే జ్వరం వచ్చింది. ‘అయ్యో.. హేమ్లా. ఒంట్లో జ్వరమున్నా.. పంటను కాపాడుకోవాలన్న నీ తాపత్రయం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. అంటూ వినాయకుడు అక్కడి నుంచి బయల్దేరాడు.
అయ్యో.. ఇన్ని కష్టాలా..
మానుకోట,వరంగల్ జిల్లాల్లో రైతుల బారులు, ఆందోళనలు చూసి చలించిపోయాడు వినాయకుడు. నర్సంపేట, చెన్నారావుపేట, కేసముద్రం మండలం కల్వల రైతు వేదిక వద్ద రైతుల తోపులాట, నర్సింహులపేట పీఏసీఎస్ వద్ద రైతులు చేస్తున్న రాస్తారోకో, గూడూరు మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ సెంటర్ జాతీయ రహదారి 365పై ఆందోళన, కురవి, కొత్తగూడలో యూరియా కోసం వచ్చిన మహిళలు çస్పృహతప్పి కిందపడిపోవడం చూసి నా రైతన్నలకు ఇన్ని కష్టాలా.. పాలకులేమి చేస్తున్నరు అంటూ లోలోన మదన పడుతూ ముందుకు సాగాడు.