
వర్ష బీభత్సానికి నీట మునిగిన వరి, పత్తి చేలు
పలుచోట్ల తడిసిన ధాన్యం, మక్కలు
వరంగల్, యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో రైతన్న కడగండ్లు
సాక్షి, వరంగల్ నెట్‌వర్క్/యాదాద్రి/భద్రాద్రి కొత్తగూడెం/చౌటుప్పల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పంటలు నీటమునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ఎనుమాముల మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో మిర్చితోటల్లోకి వర్షం నీరు చేరింది.
నెక్కొండ మండలం చంద్రుగొండలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతిచెందాయి. మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన మక్కలు, బయ్యారం, గూడూరు మండలాల్లో రోడ్లవెంట, చెలకల వద్ద ఆరబోసిన మక్కలు తడిసిపోయాయి. మరిపెడ, కురవి, కేసముద్రం, గూడూరు, దంతాలపల్లి మండలాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. మహబూబాబాద్ పట్టణ సమీపంతో పాటు డోర్నకల్‌లో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఏజెన్సీలోని కొత్తగూడలో వాగులు ఉరకలేస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల సమీపంలో పాకాల యేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కురవి, సీరోలు మండలాల్లోనూ వాగులు, వంకల ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ జిల్లా కటాక్షపూర్ చెరువు మత్తడి జాతీయ రహదారి 163పైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లోనూ బీభత్సం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పత్తి, వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. సుమారు 500 ఎకరాల్లో పత్తి చేలు దెబ్బతిన్నాయి. పలు మార్కెట్ యార్డుల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. ఆయా మండలాల్లో వాగులు ఉధృతంగా పారుతున్నాయి. నక్కలగూడెంలో కోళ్ల ఫారంలోకి భారీగా వరద నీరు చేరి.. 6 వేల బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి.
అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో మొదలైన వాన సోమవారం ఉదయం వరకూ కొనసాగింది. ఈ వానతో వాగులు నిండి లోలెవల్ చప్టాలపైకి వరద చేరడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తి గరిష్ట స్థాయికి చేరడంతో.. ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద రావడంతో 25 గేట్లకు 11 ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. పలుచోట్ల పత్తి చేన్లలో నీరు చేరగా, వరి పొలాలు కూడా దెబ్బ తిన్నాయి. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం కురిసింది.