
మంత్రి పొంగులేటి వెల్లడి
మంత్రి సీతక్కతో కలిసి పనుల పరిశీలన.. అధికారులతో సమీక్ష
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం జాతర పనులకు రూ.251 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా రూ.101 కోట్లు మంజూరు చేయగా, వీటిలో రూ.71 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు.
గతంలో మంజూరైన జాతర ఏర్పాట్ల నిధులు రూ.150 కోట్లు కలిపి దశలవారీగా శాశ్వత ప్రాతిపదికన ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మే డారం జాతరకు వచ్చే నిధులు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా జంపన్న వాగులో వరదలాగా జారిపోకుండా.. గిరిజనుల ఆరాధ్య దైవాల ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేలా కలెక్టర్, ఎస్పీలకు సూచనలు ఇచ్చామన్నారు.
నాపై ఎవరూ ఫిర్యాదు చేసే చాన్సే లేదు..
మేడారం పనుల విషయంలో కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయని మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ‘నేనేంటో అందరికీ తె లుసు. రూ.70 కోట్ల కాంట్రాక్ట్ పనులకు తాపత్రయపడే అవసరం నాకు లేదు. నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదు. అధిష్టానానికి ఫిర్యాదు చేసే చాన్సే లేదు. ఆ వార్తలను నేను నమ్మడం లేదు’అని బదులిచ్చారు. జాతరలోపు నెలకు రెండుమూడు సార్లు జాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. తాను రాకున్నా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల నమూనాను పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రి సీతక్క తదితరులు