
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు జోరందుకోనున్నాయి. పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 1.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. సెప్టెంబర్ 2న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది.
సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2వ తేదీన విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మూడో తేదీన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనీ, గురువారం వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.