
దివంగత సీఎం వైఎస్సార్ చొరవతో 40 ఏళ్ల ఆర్థిక ఒడిదుడుకుల నుంచి విముక్తి
రక్షణ రంగంలో విలీన అంశంలో కీలక పాత్ర పోషించిన మహానేత
గత తొమ్మిదేళ్లుగా లాభాల బాటలో హెచ్‌ఎస్‌ఎల్
విశాఖ సిటీ: హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌ఎల్) సరికొత్త మైలురాయిని అందుకుంది. తొమ్మిదేళ్లుగా లాభాల బాటలో పయనిస్తున్న హెచ్‌ఎస్‌ఎల్ మినీ రత్నగా ఆవిర్భవించింది. నాలుగు దశాబ్దాల పాటు ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమైన హెచ్‌ఎస్‌ఎల్‌కు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో పునరుజ్జీవం దిశగా అడుగులు పడ్డాయి. ప్రైవేటీకరణ ప్రమాదం నుంచి బయటపడి రక్షణ రంగంలో విలీనమవడంలో ఆయన పాత్ర కీలకం.
ఆ తర్వాత నుంచి దేశీయ, అంతర్జాతీయ నౌకల మరమ్మతులపై దృష్టి పెట్టి, గత తొమ్మిదేళ్లుగా లాభాల బాటలో పయనిస్తూ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ఏటా రూ.100 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జిస్తోంది. విశాఖను కేవలం షిప్ రిపేర్ హబ్‌గా మాత్రమే కాకుండా, షిప్ బిల్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దేలా రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనులను దక్కించుకుంది. తాజాగా ప్రతిష్టాత్మకమైన మినీ రత్న హోదాను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
వైఎస్సార్ చొరవతో రక్షణ శాఖ పరిధిలోకి..
1941లో సింథియా షిప్‌యార్డుగా ప్రారంభం కాగా.. 1961లో సంస్థను జాతీయం చేసి హిందుస్థాన్ షిప్‌యార్డుగా మార్చారు. తొలి నాళ్లలో దేశంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల విషయంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ.. కొన్నేళ్లలోనే ప్రతికూల పరిస్థితులను చవిచూసింది. 1980 నుంచి నష్టాల ఊబిలో కూరుకుపోయి చివరకు ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితికి చేరుకుంది.
ఈ దశలో ప్రైవేటీకరణ వైపు
వెళ్లింది. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో షిప్‌యార్డ్ ప్రైవేటుపరం కానివ్వబోమని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో షిప్‌యార్డ్ 2010లో రక్షణ శాఖ పరిధిలోకి వచ్చిoది.
తొమ్మిదేళ్లుగా లాభాల బాటలో..
రక్షణ శాఖలో విలీనం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఆర్డర్లు రాక ఇబ్బందులు పడుతూ, ఉద్యోగులను కూడా తొలగించాలన్న ఆలోచన చేసిన యాజమాన్యం.. ఆ తర్వాత క్రమంగా ఒక్కో అవరోధాన్ని అధిగమిస్తూ.. కొత్త ఆర్డర్లను చేజిక్కించుకుంది. 2015 తర్వాత, హెచ్‌ఎస్‌ఎల్ ఆర్థిక నిర్వహణ, ఉత్పాదకత, సాంకేతిక ఆధునీకరణలో లక్ష్య సంస్కరణలను అమలు చేసింది.
దేశీయ నౌకలు, సబ్ మెరైన్ల మరమ్మతులతో పాటు విదేశీ నౌకల మరమ్మతుల ఆర్డర్లను దక్కించుకుంది. వాటిని రికార్డు సమయంలోనే పూర్తి చేస్తూ, ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టులను పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీని గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు 40 నౌకల రీఫిట్ పనులను పూర్తి చేసింది.
మినీరత్న హోదా..
వరుసగా లాభాల బాటలో పయనిస్తున్న హిందుస్థాన్ షిప్‌యార్డు ఎలాంటి అప్పులు లేకుండా, ఏటా లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలకు అందించే మినీరత్న హోదాను కైవసం చేసుకుంది. ప్రస్తుతం దేశంలో కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్‌ఎస్‌ఈ), గోవా షిప్‌యార్డు వంటి కొన్ని సంస్థలకు మినీరత్న హోదా ఉంది. నిజానికి 2023–24 ఆరి్థక సంవత్సరంలోనే షిప్‌యార్డు ఈ ఘనతను సొంతం చేసుకునేది.
ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ నిర్మాణ పనులను తొలుత హెచ్‌ఎస్‌ఎల్‌కు ఇచ్చేందుకు రక్షణ శాఖ సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో రెండు షిప్పుల నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంతో షిప్‌యార్డు మూడింటితోనే సరిపెట్టుకుంది. ఈ కారణంగా మినీరత్న హోదా ఏడాది ఆలస్యమైంది. 40 ఏళ్ల షిప్‌యార్డు చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,586 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతంతో పోలిస్తే 36 శాతం వృద్ధితో రూ.166 కోట్ల నికర లాభాన్ని పొంది మినీరత్నగా అవతరించింది.
మినీ రత్న గర్వకారణం
హెచ్‌ఎస్‌ఎల్‌కు మినీ రత్న హోదా దక్కడం గర్వకారణం. ఈ హోదా సాధించడం సిబ్బంది అంకితభావం, నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. అలాగే సంస్థ ప్రగతికి కారణమైన రక్షణ మంత్రిత్వ శాఖ, కస్టమర్లు, వ్యాపార భాగస్వాముల మద్దతు, నమ్మకం, సహకారానికి కృతజ్ఞతలు. ఈ ఉత్సాహంతో మరింత ప్రగతిని సాధించే లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. వాటిని సాధించడానికి ప్యూహాత్మక సహకారాలతో పాటు అధునాతన షిప్‌బిల్డింగ్ టెక్నాలజీని సొంతం చేసుకోవడంపై దృష్టి పెడతాం. – కమడోర్ గిరిదీప్ సింగ్, సీఎండీ, హెచ్‌ఎస్‌ఎల్