
ప్రతి నెలా రూ.20 వేల ఖర్చు
శ్రీకాకుళంలోని డీఆర్వో కుటుంబానికీ ప్రతి నెలా కిరాణా సరకులు పంపాల్సిందే
తహసీల్దారు కార్యాలయాలకు భారంగా వ్యవహారం
డీఆర్వో భవానీశంకర్‌ను నియంత్రించాలంటూ కలెక్టర్‌కు ఆర్డీవో శ్రీలేఖ లేఖాస్త్రం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) క్యాంపు కార్యాలయానికి అవసరమైన చింతపండు, పసుపు, గోధుమపిండితోపాటు ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు, బట్టల క్లిప్పులు ఇలా అన్ని కొనివ్వాల్సిందే. ఈ భారమంతా నా పరిధిలోని తహసీల్దారు కార్యాలయాలపై పడుతోంది. ప్రతి నెలా రూ.20 వేల విలువైన కిరాణా సామగ్రి పంపాల్సి వస్తోంది. అంతేకాకుండా శ్రీకాకుళంలోని డీఆర్వో కుటుంబానికి కూడా ప్రతి నెలా కిరాణా సామగ్రి పంపాల్సి వస్తోంది. గాజువాక, పెందుర్తి తహసీల్దారు కార్యాలయ సిబ్బందిపై ఈ భారాన్ని మోపుతున్నారు.
దీనిపై విచారణ చేసి ఆ ఖర్చు పడకుండా చూడండి’ అంటూ కలెక్టరుకు విశాఖపట్నం ఆర్డీవో శ్రీలేఖ లేఖ రాయడం సంచలనమైంది. ప్రతి నెలా ఈ భారాన్ని మోపకుండా చూడాలంటూ కలెక్టరును అభ్యర్థించిన ఆమె.. దీని ప్రభావంతో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడటం ద్వారా ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ∙సీతమ్మధార, పద్మనాభం మండలాల పరిధిలోని రెవెన్యూ సిబ్బందిపై కూడా ఇదే తరహాలో ఉప్పు, పప్పు భారం మోపుతున్నట్టు ఆమె ఆరోపించారు. రెవెన్యూశాఖ ఉన్నతాధికారి కావడంతో సిబ్బంది ఏమీ అనలేకపోతున్నారని... ఈ కారణంగా సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారని శ్రీలేఖ పేర్కొన్నారు. అయితే దీనిపై కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
శ్రీకాకుళానికి కిరాణా సామగ్రి
ప్రతి నెలా డీఆర్వో క్యాంపు కార్యాలయానికి అవసరమైన కిరాణా సామగ్రి ఖర్చు రూ.20 వేల వరకూ అవుతోందని తాను సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఆర్డీవో తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా డీఆర్వో భవానీశంకర్ కుటుంబం ఉంటున్న శ్రీకాకుళానికి కూడా పంపాల్సి వస్తోందంటూ పేర్కొనడం గమనార్హం. కేజీ చింతపండు, కేజీ పసుపు కొమ్మలు, కిరాణాతోపాటు ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు, బట్టల క్లిప్పుల ఖర్చు భారం రెవెన్యూ సిబ్బందిపై వేస్తున్నారంటూ తన లేఖలో ఆరోపించడం గమనార్హం. రెవెన్యూశాఖ పరిధిలో డీఆర్వో ఉన్నతాధికారి కావడంతో.... రెవెన్యూ సిబ్బందిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని ఆమె పేర్కొన్నారు. తద్వారా కిందిస్థాయి రెవెన్యూ సిబ్బందిలో అవినీతి పెరిగిపోయేందుకు కూడా ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
విచారణ జరపండి..
డీఆర్వో క్యాంపు ఖర్చుల భారం తన పరిధిలోని పెందుర్తి, గాజువాక రెవెన్యూ సిబ్బందితో పాటు సీతమ్మధార, పద్మనాభం మండలాల పరిధిలోని రెవెన్యూ సిబ్బందిపై కూడా పడుతున్నట్టు పేర్కొన్నారు. క్యాంపు ఖర్చులకు సంబంధించిన బిల్లులన్నీ చేతితో రాసినవే ఉన్నాయని... కంప్యూటర్ బిల్లులు మాత్రం తన వద్ద లేవని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కలెక్టరుకు విన్నవించారు. తన పరిధిలోని తహసీల్దారు కార్యాలయ సిబ్బంది నుంచి డీఆర్వో క్యాంపు ఖర్చుల భారం పడకుండా చూడాలని కూడా ఆమె తన లేఖలో కలెక్టరును కోరారు. ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఈ లేఖపై కలెక్టర్ విచారణకు ఆదేశిస్తారా? లేఖ రాసిన ఆర్డీవోపై చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది.

ఇద్దరి మధ్య కోల్డ్‌వార్
వాస్తవానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో లోలోపల వివాదాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. డీఆర్వో భవానీశంకర్, ఆర్డీవో శ్రీలేఖల మధ్య కొంత కాలంగా పలు వ్యవహారాల్లో కోల్డ్ వార్ నడుస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇరువురూ ఉప్పు–నిప్పుగా వ్యవహరిస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. తాజాగా కలెక్టర్‌కు రాసిన లేఖతో వీరువురి మధ్య వివాదం కాస్తా ముదురు పాకాన పడినట్టు తెలుస్తోంది.
