
సాక్షి, తగరపువలస: విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలో సుమారు రూ.70 కోట్ల విలువైన ఆరు ఎకరాల 69 సెంట్ల భూమిని తమకు తెలియకుండా తప్పుడు పత్రాలతో జీపీ రాయించుకున్నారని ఈ భూమి వారసులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ కుమారుడు ఎస్‌వీఎస్ గిరీష్ ఈ జీపీ చేయించుకున్నారని ఈ భూమి వారసులైన దంతులూరి సుజాత, కలిదిండి నరేంద్రవర్మ, బుద్ధరాజు వరలక్ష్మి శనివారం మీడియాకు తెలిపారు.
ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. 13.2, 14.1, 15.1, 15.4, 15.5, 15.6, 15.8, 92.2, 93.1 తమ భూమి సర్వే నెంబర్లని చెప్పారు. అయితే, దంతులూరి రామకృష్ణరాజు కుమారుడు నారాయణరాజు వారసుల్లో ఒకరైన పకీరురాజు, మిగిలిన వారసులకు తెలీకుండా, ఆయనొక్కడే వారసుడినని చెప్పుకుని మోసపూరితంగా పాసు పుస్తకాలు, 1బీ సృష్టించి, 2023 అక్టోబరులో గిరీష్‌కు జీపీ ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తాళ్లవలస టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు డీఏఎన్ రాజు, పూసపాటి గోపాలమూర్తి రాజు సహకరించారని బాధితులు వివరించారు.
దొడ్డిదారిన ఎల్‌పీ, నాలా అనుమతులు..
ఈ మోసాన్ని తాము గుర్తించి భీమిలి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, వీఎంఆర్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు వాపోయారు. రెండేళ్లుగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా పకీరు ఒక్కడే వారసుడు అనడానికి సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు ఇవ్వలేదన్నారు. ఈ భూములపై జిల్లా కోర్టులో ఓఎస్ 115/2025 కేసు రిజిస్టర్ అయి, ఆర్‌ఓఆర్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్నప్పటికీ, జీపీ పొందిన టీడీపీనేత గిరీష్ దొడ్డిదారిన ఎల్‌పీ, నాలా అనుమతులు పొందాడని ఆరోపించారు.
ఈనెల 5 నుంచి గిరీష్ తన మనుషులతో వచ్చి వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలు రాత్రింబవళ్లు చేస్తున్నారని తెలిపారు. గిరీష్ అధికార టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు తమకు న్యాయం చేయడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ప్రాణహాని ఉందని, ఇటీవల కారుతో తొక్కించి తమను అంతమొందించేందుకు కూడా యత్నించారని బుద్ధరాజు వరలక్ష్మి, ఆమె భర్త రామకృష్ణ రాజు ఆరోపించారు. తప్పుడు పత్రాలతో జీపీ చేసిన వారిపైనా, చేయించుకున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.