రాజస్థాన్‌ రాయల్‌ టూర్‌..! | Rajasthan Tour Packages On The IRCTC Tourism | Sakshi
Sakshi News home page

IRCTC: రాజస్థాన్‌ రాయల్‌ టూర్‌..!

Sep 1 2025 10:53 AM | Updated on Sep 1 2025 12:41 PM

Rajasthan Tour Packages On The IRCTC Tourism

ఇది రాజకోట రహస్యం చిత్రం కాదు. అచ్చంగా రాజపుత్రులు ఏలిన కోటలు. దుర్బేధ్యమైన కోటలు... చక్కని ప్యాలెస్‌లు. ఉదయ్‌ సింగ్‌ కట్టించిన సిటీ ప్యాలెస్‌. సజ్జన్‌సింగ్‌ మాన్‌సూన్‌ ప్యాలెస్‌. మహారాణా పోరుగడ్డ హల్దీఘాటీ. రాథోడ్‌ జోధా కట్టిన మెహరాన్‌గఢ్‌. యూరోపియన్‌ స్టైల్‌ ఉమేద్‌భవన్‌. బ్రహ్మకు ఆలయం కట్టిన పుష్కర్‌. జయ్‌పూర్‌ పాలకుల అమేర్‌ ఫోర్ట్‌. సిటీ ప్యాలెస్‌... హవామహల్‌... ఇవన్నీ రాజస్థాన్‌లో సాగే రాయల్‌ టూర్‌లో.

1వ రోజు: హైదరాబాద్‌ నుంచి ఉదయ్‌పూర్‌కి ప్రయాణం. టూర్‌ నిర్వహకులు ఉదయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో పికప్‌ చేసుకుంటారు. హోటల్‌ గదికి వెళ్లి చెక్‌ ఇన్‌ కావడం, హోటల్‌లో లంచ్‌ తర్వాత సిటీ ΄్యాలెస్‌ సందర్శనం, పిచోలా లేక్‌లో విహారం, రాత్రి డిన్నర్, బస ఉదయ్‌పూర్‌లోనే.

ఉదయ్‌పూర్‌ రాజమందిరం
సిటీ ప్యాలెస్‌గా వ్యవహారంలో ఉన్న ఈ భవనం ఉదయ్‌పూర్‌ రాజుల పాలన, నివాస మందిరం. సిసోడియా రాజవంశం రాజులు అనేక మంది ఈ భవనం నుంచే పాలన సాగించారు. ప్రస్తుతం ప్యాలెస్‌లో కొంత భాగంలో సిసోడియా రాజకుటుంబ వారసుడు లక్ష్యరాజ్‌ సింగ్‌ మేవార్‌ నివసిస్తున్నాడు. కొంత భాగంలో పర్యాటకులను అనుమతిస్తారు. రాణి వంటగది, రాజు యుద్ధ సామగ్రి, యుద్ధం సమయంలో రాజు ధరించే కవచాన్ని పరిశీలనగా చూడాలి. రాజు కవచం సైజును బట్టి రాజు ఎత్తు అంచనాకు వస్తుంది. 

అలాగే రాణాప్రతాప్‌ గుర్రం చేతక్‌ యుద్ధం సమయంలో ధరించే కవచం కూడా ఉంది. చేతక్‌ నమూనా గుర్రాన్ని తయారు చేయించి ఆ కవచాన్ని ధరింపచేశారు. ఆ గుర్రం తెల్లగా ఎత్తుగా, పొడవుగా ఉంటుంది. ఇక రాణి మందిరం విషయానికి వస్తే మందిరం ముందు రాజు వేచి ఉండే పాలరాతి బల్లను చూడాలి. రాజు ఒక వేళ రాణి అలంకరణ పూర్తయ్యే లోపే వస్తే అలంకరణ పూర్తయ్యే వరకు ఆ పాలరాతి బల్ల మీద కూర్చుని ఎదురు చూసేవాడని చమత్కారంగా చెబుతారు గైడ్‌లు. 

ఏనుగుల బలప్రదర్శన గోడను చూడాలి. గోడకు అవతల ఒక ఏనుగు, ఇవతల ఒక ఏనుగు ఉంటాయి. తొండాలను మెలి వేసి వెనక్కు లాగుతాయి. తనను తాను ఆపుకోలేక ముందుకు వచ్చి గోడను తాకిన ఏనుగు ఓడిపోయినట్లు. పిచోలా సరస్సు ఒడ్డున ఉంది సిటీప్యాలెస్‌. సరస్సు మధ్యలో లేక్‌ ప్యాలెస్, ఒక వైపుగా జగ్‌మందిర్, జగ్‌మోహన్‌ ప్యాలెస్‌లను పడవలో విహరిస్తూ చుట్టిరావచ్చు. లేక్‌కు మరొక ఒడ్డున దర్బార్‌హాల్‌ ఉంటాయి. దర్బార్‌హాల్‌లో నాటి రాజకొలువు బొమ్మలతో కొలువు దీరి ఉంటుంది.

2వ రోజు: బ్రేక్‌ఫాస్ట్‌ తరవాత హోటల్‌ నుంచి బయలుదేరి సజ్జన్‌గఢ్‌ ప్యాలెస్‌కు ప్రయాణం. ప్యాలెస్‌ సందర్శనం తర్వాత ప్రయాణం హల్దీఘాటికి. హల్దీఘాటిలో మహారాణా ప్రతాప్‌ మ్యూజియం చూసిన తర్వాత సాయంత్రం నథ్‌ద్వారా కోట సందర్శనం. రాత్రి బస ఉదయ్‌పూర్‌లోనే.

ఎడారి మేఘం
సజ్జన్‌గఢ్‌ ప్యాలెస్‌ నిర్మాణాన్ని మహారాణా సజ్జన్‌ సింగ్‌ ఓ గొప్ప ఆలోచనతో మొదలుపెట్టాడు. జయ్‌పూర్‌లో జంతర్‌మంతర్‌లాగా ఖగోళ పరిశోధన, అధ్యయన కేంద్రం నిర్మించాలనుకున్నాడు. అలాగే మేవార్‌ రాజధాని నగరం ఉదయ్‌పూర్‌ మొత్తం కనిపించే విధంగా ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండ మీద నిర్మించాడు. 

ఐదంతస్థుల ఈ ప్యాలెస్‌ పైనుంచి చూస్తే ఉదయ్‌పూర్‌లోని సరస్సులు కనిపిస్తాయి. వర్షాకాలంలో రాజు ఇక్కడ కొద్దిరోజులు విడిది చేసి రాజ్యంలో నీటి నిల్వలను గమనించేవాడని చెబుతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేవార్‌ పాలకులు ఉదయ్‌పూర్‌ని రాజధాని చేసుకోక ముందు చిత్తోర్‌గఢ్‌ నుంచి పాలన సాగించేవారు. సజ్జన్‌ గఢ్‌ ప్యాలెస్‌ నుంచి చిత్తోర్‌గఢ్‌ కోట కూడా కనిపించే విధంగా డిజైన్‌ చేసుకున్నారు. 

కానీ సజ్జన్‌సింగ్‌ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన పాలకులు ప్యాలెస్‌ నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు కానీ ఖగోళ అధ్యయనం దిశగా పనులు సాగలేదు. మూడు ప్రధాన ఉద్దేశాల్లో రెండు ఉద్దేశాలు మాత్రమే నెరవేరాయి. ఈ ప్యాలెస్‌లోకి పర్యాటకులు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వాహనాల్లో వెళ్లాలి. సజ్జన్‌గఢ్‌ను సూర్యాస్తమయం సమయంలో చూడగలిగితే బంగారు రంగులో మెరుస్తూ అందంగా ఉంటుంది.

ఆత్మాభిమాన పోరు
హల్దీఘాటీ అనే ప్రదేశం పేరుకు తగ్గట్లే పసుపు రంగులో ఉంటుంది. మట్టి, రాయి, రప్ప అంతా నేలకు పలుచగా పసుపు అద్దినట్లు, పసుపు నీటితో కళ్లాపి చల్లినట్లు ఉంటుంది. ఉదయ్‌పూర్‌ జిల్లా నుంచి రాజ్‌సమంద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో వస్తుంది. ప్రధాన రహదారి నుంచి డైవర్షన్‌ తీసుకున్న తర్వాత దాదాపు 30 కిలోమీటర్ల దూరం అటవీ ప్రదేశంలో ప్రయాణించాలి. 

హల్దీఘాటీలో యుద్ధభూమిని చేరేలోపు చేతక్‌ స్మారకం కనిపిస్తుంది. రాణాప్రతాప్‌కు ఇష్టమైన గుర్రం చేతక్‌. యుద్ధంలో రాణా ప్రతాప్‌ గాయపడడంతో ఆ సంగతి తెలుసుకున్న చేతక్‌ యజమానిని కాపాడుకోవడానికి యుద్ధరంగం నుంచి పరుగులంఘించుకుంది. మధ్యలో ప్రహిస్తున్న బాణాస్‌ నదిని దాటడానికి ఒక్క ఉదుటున దుమికింది. అప్పుడది గాయపడి ఆ తర్వాత కొద్ది దూరం ప్రయాణించి నేలకొరిగింది. 

చేతక్‌ జ్ఞాపకార్థం రాణా ప్రతాప్‌ నిర్మించిన స్మారకం అది. ఇది కాకుండా ఉదయ్‌పూర్‌ నగరంలో తెల్లటి చేతక్‌ విగ్రహంతో చేతక్‌ సర్కిల్‌ కూడా ఉంది. ఇక హల్దీఘాటీలో మ్యూజియాన్ని చూస్తే రాణాప్రతాప్‌ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. ఈ యుద్ధంలో మొఘల్‌ ప్రతినిధిగా మాన్‌సింగ్, మేవార్‌ పాలకుడిగా మహారాణా ప్రతాప్‌ తలపడ్డారు. భీకర యుద్ధం జరిగింది కానీ రాణాప్రతాప్‌ తన మేవార్‌ రాజ్యాన్ని మొఘలుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు.

3వ రోజు: ఉదయ్‌పూర్‌ నుంచి జోద్‌పూర్‌కి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి జోద్‌పూర్‌ వైపు సాగిపోవాలి. జద్‌పూర్‌లో మెహరాన్‌గఢ్‌ కోట వీక్షణం తర్వాత హోటల్‌లో చెక్‌ ఇన్‌. రాత్రి బస జో«ద్‌పూర్‌లో.

సూర్యుడి కోట
మెహరాన్‌గఢ్‌ అంత పెద్దది ఇంత విశాలమైనది అని చెప్పడం కంటే... పన్నెండు వందల ఎకరాల్లో విస్తరించిన నిర్మాణాల సముదాయం అని ఒక్క మాటలో చెప్పాలి. ఇంగ్లిష్‌ రచయిత రడ్‌యార్డ్‌ క్లిప్పింగ్‌ ఈ కోటను వర్ణిస్తూ ‘దిగ్గజ భవన నిర్మాత నిర్మించిన కోటకు ఉదయించే సూర్యుడు రంగులద్దినట్లు ఉంది’ అన్నాడు. 

ఈ భవనం పేరు కూడా సూర్యుడి పేరుతోనే వచ్చింది. మిహిర్‌ఘర్‌ అంటే సూర్యుని కోట అని, అదే పదాన్ని రాజస్థానీ భాషలో మెహరాన్‌గఢ్‌ అంటారు. రాథోర్‌ రాజవంశం నిర్మించిన కోట ఇది. రాథోర్‌లు సూర్యుడి ఆరాధకులు. దాంతో కోటను ఉదయించే సూర్యుని కిరణాలతో ప్రభవించేటట్లు డిజైన్‌ చేశారు. ఈ కోటను రావు జోధా అనే రాజు నిర్మించాడు. అతడి పేరుతోనే ఈ రాజ్యానికి జో«ద్‌పూర్‌ అనే పేరు వచ్చింది. ఇందులోని బంగారు పల్లకి దగ్గర ఫొటో తీసుకోవడం మరిచిపోవద్దు.

4వ రోజు: జోద్‌పూర్‌ నుంచి పుష్కర్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి బయలుదేరాలి. ఉమేద్‌ భవన్‌ ΄్యాలెస్‌ సందర్శనం తర్వాత పుష్కర్‌కు ప్రయాణం. హోటల్‌లో చెక్‌ ఇన్, రాత్రి బస పుష్కర్‌లో.

ఇండో–యూరోపియన్‌ ప్యాలెస్‌
రాజస్థాన్‌ రాష్ట్రం కోట తెలుగు వారికి సుపచిరితమైన ప్రదేశం. ఆ రాజ్యాన్ని పాలించిన రాజు మహారావ్‌ రెండవ ఉమేద్‌ సింగ్‌ నిర్మాణం మొదలుపెట్టాడు. అతడి పేరుతోనే ఉమేద్‌ భవన్‌ ప్యాలెస్‌గా వాడుకలోకి వచ్చింది. ఇతర రాజస్థాన్‌ నిర్మాణాలతో పోల్చి చూసినప్పుడు ఇందులో కొంత వైవిధ్యంగా యూరోపియన్‌ నిర్మాణశైలి కనిపిస్తుంది. 

బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ సామ్యూల్‌ స్విన్‌టన్‌ చేత దీనిని డిజైన్‌ చేయించాడు ఉమేద్‌ సింగ్‌. నిర్మాణం ఇరవయ్యవ శతాబ్దం వరకు సాగింది. ఇందులో కోట రాజవంశం నివసిస్తోంది. కొంత భాగంలో పర్యాటకులను అనుమతిస్తారు. ఇది ఇప్పుడు హెరిటేజ్‌ హోటల్‌.

ఆలయాల నిలయం పుష్కర్‌
పుష్కర్‌ అనగానే పుష్కర్‌ సరస్సు గుర్తొస్తుంది. ఈ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం ఇది. ఈ సరస్సులో స్నానం చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఆలయాలను లెక్క చెప్పడం సాధ్యం అయ్యే పని కాదు. 

నాలుగు వందల వరకు ఉంటాయని అంచనా. సిక్కులకు కూడా ఇది పవిత్రస్థలం. పుష్కర్‌ యాత్రికులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఇక్కడ ధూమపానం, మద్యపానం, మాంసాహారాన్ని భుజించడం నిషిద్ధం. ఇక్కడ ఏటా కార్తీక మాసంలో జరిగే కామెల్‌ ఫెయిర్‌ ప్రసిద్ధి. ఈ వేడుక కోసం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, విదేశీయులు కూడా వస్తారు.

5వ రోజు: పుష్కర్‌ నుంచి జయ్‌పూర్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్, బ్రహ్మ మందిర దర్శనం తర్వాత జయ్‌పూర్‌కి ప్రయాణం. జయ్‌పూర్‌లో సిటీ ప్యాలెస్‌ వీక్షణం, హవామహల్‌ మీదుగా హోటల్‌కు ప్రయాణం. గదిలో చెక్‌ ఇన్, రాత్రి బస జయ్‌పూర్‌లో.

బ్రహ్మ మందిరం
భూమ్మీద బ్రహ్మకు ఆలయం లేని లోటును తీరుస్తోంది పుష్కర్‌. ఇక్కడి బ్రహ్మమందిరాన్ని విశ్వామిత్రుడు నిర్మించాడని చెబుతారు. విశ్రామిత్రుడు బ్రహ్మ కోసం యజ్ఞం చేసిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించాడనేది స్థల పురాణం. ఆ తర్వాత ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుడు పునరుద్ధరించాడు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆలయ రూపం 14వ శతాబ్దంలో మహారాజా జవత్‌రాజ్‌ నిర్మాణం.

జయ్‌పూర్‌ సిటీ ప్యాలెస్‌
మహారాజా సవాయ్‌ రెండవ జయ్‌సింగ్‌ నిర్మించిన ప్యాలెస్‌ ఇది. అమేర్‌ నుంచి రాజధానిని జయ్‌పూర్‌కు మారుస్తూ ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. అప్పటి నుంచి రాజకుటుంబం సిటీ ప్యాలెస్‌లో నివసించేది. రాజకుటుంబ పరివారం ఐదు వందల కుటుంబాలు ప్యాలెస్‌ కాంప్లెక్స్‌లో ఉన్న ఇతర భవనాల్లో నివసించేవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజాస్థానాలు దేశంలో విలీనమయ్యే వరకు జయ్‌పూర్‌ అధికారిక రాజభవనం ఈ సిటీ ప్యాలెస్‌. 

ఇప్పుడిది గొప్ప పర్యాటక ప్రదేశం. ఇందులో సవాయ్‌ రెండవ మాన్‌సింగ్‌ మ్యూజియం ఉంది. రాణి పద్మిని ఆధ్వర్యంలో ఏర్పాటైన మహారాజా సవాయ్‌ మాన్‌సింగ్‌ మ్యూజియం ట్రస్ట్‌ ను ప్రస్తుతం యువరాణి దియాకుమారి నిర్వహిస్తోంది. శోభానివాస్‌లో గ్లాస్‌ వర్క్, ఛావీ నివాస్‌లో నీలిరంగు గదిలో ఉన్న కళాత్మకతకు నాటి ఆర్కిటెక్ట్‌ల నైపుణ్యానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. హవామహల్‌ మీదుగానే ప్రయాణం సాగుతుంది. శ్రీకృష్ణుడి కిరీటం ఆకారంలో ఉన్న హవామహల్‌ సౌందర్యాన్ని ఆస్వాదించాలి.

6వ రోజు: జయ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసిన తర్వాత బిర్లా టెంపుల్‌ వీక్షణం, ఆమేర్‌ ఫోర్ట్‌సందర్శనం తర్వాత టూర్‌ నిర్వహకులు సాయంత్రం జయ్‌పూర్‌ ఎయిర్‌΄ోర్ట్‌లో డ్రాప్‌ చేస్తారు. విమానం రాత్రి 8.50 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది.

అమేర్‌... మాన్‌సింగ్‌ మందిరం
జయ్‌పూర్‌ నగరానికి 11 కిలోమీటర్ల దూరాన ఉంది అమేర్‌ ఫోర్ట్‌. ఇది కొండ మీద ఉంది. ఆరావళి పర్వతశ్రేణుల్లో విస్తరించిన రాజపుత్రుల రాజ్యంలో కోటలు, ప్యాలెస్‌లన్నీ నిర్మాణ అద్భుతాలే. రాజధానిని సిటీ ప్యాలెస్‌కు మార్చకముందు ఈ కోట నుంచే పాలన సాగింది. 

సామాన్య ప్రజలు రాజును కలవడానికి దివానీ ఆమ్, మంత్రివర్గంతోపాటు ఇతర ప్రముఖులు రాజుతో సమావేశమయ్యే దివానీ ఖాస్‌లు నాటి పరిపాలనను చాటి చెప్పే నిదర్శనాలు. రాజా మాన్‌సింగ్‌ ఇందులోనే నివసించాడు. ఈ నిర్మాణంలో పై అంతస్తులో మాన్‌సింగ్‌ బెడ్‌రూమ్, అతడి గది నుంచి కింది అంతస్థులో పన్నెండు మంది రాణుల బెడ్‌రూమ్‌లకు వెళ్లే మెట్ల నిర్మాణాన్ని పరిశీలించడం మరిచిపోవద్దు.

‘రాయల్‌ రాజస్థాన్‌’ టూర్‌ ప్యాకేజ్‌ కోడ్‌ ఎస్‌హెచ్‌ఏ12. ఈ ఆరు రోజుల పర్యటన హైదరాబాద్‌ ఎయిర్‌΄ోర్ట్‌ నుంచి 14.9.2025న మొదలవుతుంది. ఈ టూర్‌లో ఉదయ్‌పూర్, జోద్‌పూర్, పుష్కర్, జయ్‌పూర్‌ కవర్‌ అవుతాయి. 

ఈ నెల 14వ తేదీ ఉదయం 7.40 గంటలకు ‘6 ఈ 6323’ విమానం హైదరాబాద్‌ నుంచి  బయలుదేరుతుంది. 9.25 గంటలకు ఉదయ్‌పూర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణం 19వ తేదీ  రాత్రి 8.50 గంటలకు ‘6ఈ 816’ విమానం జయ్‌పూర్‌ నుంచి బయలుదేరి 10 .55 గంటలకు హైదరాబాద్‌కి చేరుతుంది.

ప్యాకేజ్‌ ధరలిలాగ: కంఫర్ట్‌ కేటగిరీ సింగిల్‌ ఆక్యుపెన్సీలో 42, 450 రూపాయలు, డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 33,900, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో 32,450 రూపాయలు.

తెలుసుకోవాల్సిన మరికొన్ని సంగతులు:
విమాన ప్రయాణ సమయాల్లో అవసరాన్ని బట్టి కొద్ది మార్పులు జరిగే అవకాశం ఉంది. టూర్‌ ఐటెనరీ ΄్లానింగ్‌లో ఆలయ దర్శనానికి తగిన సమయం మాత్రమే కేటాయించడం జరుగుతుంది. పూజాదికాలు నిర్వహించాలంటే సదరు పర్యాటకులు పూజ తర్వాత తమకు తాముగా హోటల్‌ గదికి చేరాల్సి ఉంటుంది. 

టూరిస్ట్‌ ప్యాకేజ్‌ బస్‌ పూజ పూర్తయ్యే వరకు ఎదురు చూడడం సాధ్యం కాదు. ఆలయాలకు కొన్ని చోట్ల పెద్ద బస్సు వెళ్లే అవకాశం ఉండదు, అలాంటి చోట్ల పర్యాటకులు కొంత మేర నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నడవలేని వాళ్లు స్థానికంగా ఆటోలు తమకు తాముగానే పెట్టుకోవాలి.

చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!

పర్యాటకులు తమ ఆరోగ్య కారణాల రీత్యా పార్సిల్‌ ఫుడ్‌ వెంట పెట్టుకోవాలి. ఎనర్జీనిచ్చే చాక్లెట్‌లు, బిస్కట్, డ్రైఫ్రూట్స్, వేరుశనగ పప్పు వంటివైనా దగ్గర ఉంచుకోవడం మంచిది. ఈ టూర్‌ ఐటెనరీలో జయ్‌పూర్‌లో జంతర్‌మంతర్, హవామహల్‌ లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి.

ప్యాకేజ్‌లో ఇవన్నీ ఉంటాయి:
హైదరాబాద్‌ నుంచి ఉదయ్‌పూర్‌కి, జయ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కి విమానం టిక్కెట్లు. ఉదయ్‌పూర్‌లో 2 రాత్రులు, జో«ద్‌పూర్‌లో ఒక రాత్రి, పుష్కర్‌లో ఒక రాత్రి, జయ్‌పూర్‌లో ఒక రాత్రి హోటల్‌ బస. 5 రోజులు బ్రేక్‌ఫాస్ట్, ఒక లంచ్, 5 రోజులు రాత్రి భోజనం. సైట్‌ సీయింగ్‌కి ఏసీ 35 సీటర్‌ బస్‌ ప్రయాణం. ట్రావెల్‌ ఇన్సూరెన్స్, ఐఆర్‌సీటీసీ టూర్‌ ఎస్కార్ట్‌. 
– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement